పాకిస్థాన్ తో క్రికెట్.. కలలు కనాల్సిందే

Tue Jul 28 2015 12:49:39 GMT+0530 (IST)

ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఇంకా క్రికెట్ సంబంధాల గురించి బాధపడ్డమేంటి.. అంటారు కొందరు. అదే సమయంలో ఆటకు ఉగ్రవాద దాడులకు ముడిపెట్టడమేంటి.. అనంటారు ఇంకొందరు. ఇదో ఎడతెగని చర్చ. ఏడేళ్ల కిందటి వరకు మహ బాగా క్రికెట్ ఆడేవి భారత్ పాకిస్థాన్. చిరకాల ప్రత్యర్థులిద్దరూ క్రికెట్ మ్యాచ్ లో తలపడితే ఆ మజానే వేరుగా ఉండేది. వాళ్లు ఇక్కడికి రావడం.. మనం అక్కడికి వెళ్లడం.. ఇలా ద్వైపాక్షిక సిరీస్ లు బాగానే  జరిగేవి. 2008లో భారత జట్టు ఇంకొన్ని అక్కడికి వెళ్లాల్సి ఉండగా ఘోరం జరిగింది. ముంబయి దాడులు దేశాన్ని అతలాకుతలం చేయడం.. అందులో పాకిస్థాన్ పాత్ర కూడా ఉండటంతో భారత్ పాక్ క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి.

తర్వాత రెండు మూడేళ్లు క్రికెట్ సంబంధాల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. గత నాలుగేళ్ల నుంచి భారత్ పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ గురించి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఒక్క భారత్ సిరీస్ జరిగితే చాలు బయటపడిపోతామని.. మనోళ్లతో మ్యాచ్ ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. మధ్యలో ఒక్కసారి పాకిస్థాన్ జట్టు భారత్ లో పర్యటించి మూడు వన్డేలు ఆడిపోయింది. ఐతే పూర్తి స్థాయి  సిరీస్ ఈ ఏడాది ఆఖర్లో జరగొచ్చని.. యూఏఈలో ఇరు జట్లూ టెస్టు సిరీస్ ఆడతాయని అనుకుంటుండగా.. ఇప్పుడు పంజాబ్ లో ఉగ్రవాద దాడితో కథ మళ్లీ మొదటికొచ్చింది. అలా ఉగ్రవాద దాడి జరగడం ఆలస్యం.. పాక్ తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చేసింది బీసీసీఐ. మళ్లీ ఎన్నేళ్లకు ప్రతిష్టంభన వీడుతుందో కానీ.. ఈ ఏడాది ఆఖర్లో అయితే సిరీస్ జరిగే అవకాశం లేదని తేలిపోయింది.