Begin typing your search above and press return to search.

చెన్నై, రాజస్థాన్.. రద్దు లేనట్లేనా?

By:  Tupaki Desk   |   20 July 2015 10:44 AM GMT
చెన్నై, రాజస్థాన్.. రద్దు లేనట్లేనా?
X
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ విషయంలో బీసీసీఐ మరీ అంత కఠినంగా ఏమీ వ్యవహరించేలా కనిపించడం లేదు. ఆ రెండు ఫ్రాంఛైజీలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు స్వేచ్ఛ ఉన్నా.. బీసీసీఐ అ అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు. బోర్డులో ఉన్న శ్రీనివాసన్ మద్దతుదారుల ఒత్తిడి వల్లో ఏంటో.. ముంబయిలో జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఫ్రాంఛైజీల రద్దు అంశాన్ని చర్చించనే లేదు. సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ ఆ రెండు ఫ్రాంఛైజీలపై రెండేళ్ల సస్పెన్షనే విధించినప్పటికీ.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆ రెండు ఫ్రాంఛైజీలనీ రద్దు చేసే అధికారం బీసీసీఐకి ఉంది. భారత బోర్డు రద్దు నిర్ణయం తీసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని కూడా లోధా స్పష్టం చేశారు.

ఎలాగూ ఇంకో రెండేళ్లలో చెన్నై, రాజస్థాన్ సహా అన్ని ఫ్రాంఛైజీల ఒప్పందాలూ రద్దయిపోతాయి. ఐపీఎల్ ఆరంభంలో బీసీసీఐ ఫ్రాంఛైజీలతో కుదుర్చుకున్న ఒప్పందం పదేళ్లకే. 2017 తర్వాత అన్ని ఫ్రాంఛైజీలూ కాంట్రాక్టుల్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నై, రాజస్థాన్ సస్పెన్షన్ కూడా అప్పటికే పూర్తవుతుంది. కాగా ఈ రెండేళ్లకు రెండు కొత్త ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేస్తే.. మళ్లీ చెన్నై, రాజస్థాన్ తిరిగి వస్తే ఏం చేయాలన్నది బీసీసీఐకి తలనొప్పే. ఈ నేపథ్యంలో ఆ రెండు ఫ్రాంఛైజీలను రద్దు చేసేస్తే ఓ పనైపోతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది అయిన శశాంక్ మనోహర్ ఫ్రాంఛైజీల్ని రద్దు చేయడమే మంచి పరిష్కారమని సూచించాడు కూడా. కానీ తన ఫ్రాంఛైజీ చెన్నైని రద్దు చేస్తుంటే శ్రీనివాసన్ ఊరుకుంటాడా? అందుకే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తన మద్దతుదారులందరినీ ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉసిగొల్పాడు. శ్రీనివాసన్‌ తీరును వ్యతిరేకిస్తూ ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడ్డప్పుడు బీసీసీఐ కోశాధికారి పదవికి రాజీనామా చేసిన అజయ్ షిర్కే ఫ్రాంఛైజీల రద్దు కోసం పట్టుబట్టినా.. పాలకమండలిలోని మిగతా సభ్యులంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఐపీఎల్ తర్వాతి రెండు సీజన్ల విషయంలో ఏం చేయాలన్నదానిపై ఓ కమిటీ వేసి ఆరు వారాల గడువు ఇవ్వడం చూస్తుంటే కూడా మొత్తం వ్యవహారాన్ని డైల్యూట్ చేసేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఐతే ఏమాత్రం తేడా వచ్చినా సుప్రీం కోర్టు కొరఢా ఝులిపిస్తుందన్న ఆందోళన కూడా ఉంది కాబట్టి చివరికి బీసీసీఐ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.