Begin typing your search above and press return to search.

ఐపీఎల్-9, 10లో బీసీసీఐ సొంత జట్లు?

By:  Tupaki Desk   |   16 July 2015 6:08 AM GMT
ఐపీఎల్-9, 10లో బీసీసీఐ సొంత జట్లు?
X
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మీద రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడిపోయింది. సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ తీర్పు మీద రెండు ఫ్రాంఛైజీలు అప్పీల్‌కు వెళ్తామని అంటున్నాయి కానీ.. వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. లోధా కమిటీ తీర్పు ఇచ్చింది ఐపీఎల్‌ నియమావళిని అనుసరించే. ఐపీఎల్‌కు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉంది. అందులో నియమావళి ఉంది. ఫ్రాంఛైజీ యాజమాన్యంలో ఎవరైనా ఐపీఎల్ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తే ఆ ఫ్రాంఛైజీని పూర్తిగా రద్దు చేయొచ్చని అందులో ఉంది. ఆ లెక్కన చూస్తే గురునాథ్, రాజ్ కుంద్రా చేసిన నేరం ప్రకారం ఫ్రాంఛైజీల్ని పూర్తిగా రద్దు చేయకుండా.. రెండేళ్ల సస్పెన్షన్ కు పరిమితం చేసినందుకు సంతోషించాలి. కాబట్టి అప్పీల్‌కు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. చెన్నై, రాజస్థాన్ వచ్చే రెండు సీజన్లకు దూరమైనట్లే అనుకోవాలి.

ఈ రెండు ఫ్రాంఛైజీలు ఔట్ కాబట్టి ఐపీఎల్-9, 10 ఆరు జట్లకు పరిమితమవుతాయనుకుంటే పొరబాటే. టోర్నీలో కనీసం 8 జట్లు, 60 మ్యాచ్‌లు ఉంటాయని ప్రసారదారుతో ఒప్పందం ఉంది కాబట్టి.. ఇంకో రెండు జట్లను రీప్లేస్ చేయక తప్పదు. ఐతే కొత్తగా చెన్నై, రాజస్థాన్ నగరాలకు వచ్చే రెండేళ్ల కోసం బిడ్లు తెరిచి ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేస్తారా.. లేదంటే వేరే రెండు నగరాలకు ఫ్రాంఛైజీల్ని తెస్తారా అన్నది చూడాలి. రెండేళ్ల వరకే ఫ్రాంఛైజీలంటే వేలానికి కంపెనీలు ముందుకు రాకపోవచ్చు. ఇంకేదైనా న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చు. ఇలా కొత్త ఫ్రాంఛైజీల్ని ఏర్పాటు చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో చెన్నై, రాజస్థాన్ జట్లను బీసీసీఐ టేకోవర్ చేయొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న జట్లే బీసీసీఐ గొడుగు కింద ఆడతాయి. ఆటగాళ్లకు బోర్డే చెల్లింపులు చేస్తుంది. ఈ రెండు ఫ్రాంఛైజీల ద్వారా రావాల్సిన ఫీజు ఆగిపోతుంది. ఎంతో కొంత ఆదాయం వస్తుంది కానీ.. అది నామమాత్రమే. ఇది అన్ని రకాలుగా భారమే అయినప్పటికీ.. మరో ప్రత్యామ్నాయం లేకుంటే బోర్డు ఈ మార్గాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది.