Begin typing your search above and press return to search.

రిటైరైనా.. గొడవపడినా రండి.. పాక్‌ జట్టు వింత పోకడ

క్రికెట్ వీరాభిమానులకు 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గుర్తుండే ఉంటుంది..

By:  Tupaki Desk   |   10 April 2024 4:30 PM GMT
రిటైరైనా.. గొడవపడినా రండి.. పాక్‌ జట్టు వింత పోకడ
X

క్రికెట్ వీరాభిమానులకు 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గుర్తుండే ఉంటుంది.. ప్రతిష్ఠాత్మక టోర్నీలో.. భారత్ –పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్.. లీగ్ దశలో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన భారత్ అమితమైన ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ, ఒకే ఒక్క ఆటగాడు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. టైటిల్ ను భారత్ నుంచి లాగేశాడు. అద్భుత ఫామ్ లో ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, నాటి కెప్టెన్ విరాట్ కోహ్లిలను వరుసగా ఔట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 6 ఓవర్లలో 2 మెయిడెన్లు 16 పరుగులు 3 వికెట్లు.. ఇదీ అతడి ధాటి. ఈ దెబ్బకు 339 పరుగుల టార్గెట్ ఛేదనలో భారత్ ఇక కోలుకోలేకపోయింది.

అంతటి ప్రతిభ ఉన్నా..

మొహమ్మద్ ఆమీర్.. అద్భుతమైన ఎడమచేతి వాటం పేసర్. 2007 మేలో లాహోర్ లో జరిగిన పేస్ క్యాంప్ లో ఇతడిని స్పెషల్ టాలెంటెడ్ గా గుర్తించిన పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ ఎంతగానో ప్రోత్సహించాడు. వేగంతో పాటు కచ్చితత్వం ఆమీర్ సొంతం. 15 ఏళ్ల వయసుకే కాబోయే వసీం అక్రమ్ అంటూ పేరు. 17 ఏళ్లకే పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం. 2009 నాటికి ఇదీ అతడి ఘనత. 2010కి వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పేసర్ గా కీర్తి. కానీ, ఇది ఎంతో కాలం నిలవలేదు. ఆ ఏడాది ఇంగ్లండ్ టూర్ లో జరిగిన ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్ దోషిగా తేలాడు. దీంతో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. దీంతో ఆకాశం నుంచి కిందపడ్డాడు. అయితే, 18 ఏళ్ల వయసు యువకుడు కాబట్టి సీనియర్లు తప్పుదోవ పట్టించారని తేలడంతో ఆమిర్ శిక్షను తగ్గించారు. అలా 2015-16లో తిరిగి పాకిస్థాన్ జాతీయ జట్టులోకి వచ్చాడు. 2017 నాటికి పూర్వవైభవం అందుకున్నాడు.

పాక్ బోర్డును నిందించి..

అంతా బాగుంటే అతడు ఆమీర్ ఎందుకవుతాడు.. నాలుడేళ్ల కిందట పాకిస్థాన్ బోర్డుతో తీవ్రంగా విభేదించాడు. సెలక్టర్లను తప్పుబట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ లు ఆడుతూ పోతున్నాడు. అలాంటి ఆమీర్ ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ నెల 12తో 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్న అతడు తిరిగి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

లెఫ్ట్ హ్యాండ్ డామినేషన్

ఆమీర్ ఎడమచేతి వాటం పేసర్. పాక్ జట్టులో ఇప్పటికే షాహీన్ షా ఆఫ్రిది వంటి పొడగరి ఎడమచేతివాటం పేసర్ ఉన్నాడు. మొన్నటివరకు అతడు కెప్టెన్ కూడా. ఇప్పుడు ఆమీర్ రాకతో పాక్ పేస్ మరింత పదునెక్కనుంది. అయితే, ఫామ్ బాగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఆమీర్ ఎలా ఆడతాడో చూడాల్సి ఉంది.

కొసమెరుపు: ఆమిర్‌ లాగే 2020 నుంచి పాక్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇతడు కూడా ఇప్పడు పాక్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరు న్యూజిలాండ్‌ తో జరిగే టి20 సిరీస్‌ లో వీరు ఆడనున్నారు.