జగన్ టూరు.. చిచ్చుపెట్టిన ప్రొటోకాల్ వివాదం

Thu Oct 10 2019 17:08:03 GMT+0530 (IST)

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘వైఎస్ ఆర్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. అనంతపురం నేతల మధ్య సమన్వయం లోపం కారణంగా విభేదాలు పొడచూపాయి. బహిరంగంగానే వాదులాడుకోవడం చోటుచేసుకుంది.సీఎం జగన్ అనంతపురం పర్యటనకు రాగానే ఆయనకు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారు. సీనియర్ మంత్రులు - పార్టీ నేతలు హెలీప్యాడ్ వద్దకు వెళ్లి సీఎం జగన్ కు స్వాగతం పలికారు.

అయితే ప్రొటోకాల్ ప్రకారం రూపొందించిన జాబితాలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేరు లేకపోవడంతో ఆయనను జగన్ కు స్వాగతం పలికేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో అలకబూనిన ఆయన మంత్రి శంకరనారాయణతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్ నేతలు కలుగజేసుకొని సర్ధిచెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో ఇరువురు నేతలు సైలెంట్ అయ్యారు. ప్రొటోకాల్ వివాదం వైసీపీ నేతల మధ్య చిచ్చుపెట్టింది.