Begin typing your search above and press return to search.

బాబు మ‌న‌వ‌డికి బ‌ల‌పం..నేత‌ల‌కు క‌త్తులిచ్చారు

By:  Tupaki Desk   |   24 May 2017 5:25 AM GMT
బాబు మ‌న‌వ‌డికి బ‌ల‌పం..నేత‌ల‌కు క‌త్తులిచ్చారు
X
ఏపీలోని శాంతిభ‌ద్ర‌త‌ల‌పై వైఎస్ఆర్‌సీపీ ఘాటుగా మండిప‌డింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్టీ నేత‌ చెరకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనను వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. విశాఖ‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లంపల్లి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అని విమ‌ర్శించారు. చంద్రబాబు నాయుడు తన మనవడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు ప్రతిపక్ష పార్టీ నేతలను హతమార్చే పనిలో ఉన్నార‌ని మండిప‌డ్డారు. ప్రభుత్వం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని తెదేపా సీనియర్ నేత కరణం బలరామ్ స్వయంగా చెప్పడం తెదేపా హత్యారాజకీయాలకు నిదర్శనమని వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు.

నారాయణరెడ్డి హత్య కేసులో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఏ - 1 ముద్దాయిలుగా చేర్చాలని వెల్లంప‌ల్లి డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకుని పని చేస్తున్నారని మండిప‌డ్డారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధిస్తే తప్ప ఏపీలో హత్యాకాండ ఆగదని స్పష్టం చేశారు. 2014లో జరిగిన కలెక్ట‌ర్ల సమావేశంలో ముఖ్యమంత్రే స్వయంగా కలెక్ట‌ర్ల‌కు టీడీపీ నేతల ఆదేశాలు పాటించాల్సిందేనని చెప్పారని వెల్లంప‌ల్లి అన్నారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఎఎస్‌తో పాటు పోలీసులపై తెదేపా నేతలు దాడులకు పాల్పడుతుంటే వారిని సీఎం సమర్థించడం దారుణమని అన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా అపహాస్యం చేస్తున్న విధంగా తెదేపా నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఆనాటి వంగవీటి మోహన రంగా నుండి నేటి నారాయరెడ్డి హత్యల వరకు తెదేపా హత్యారాజకీయాలను చేస్తూనే ఉందన్నారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 132 జీవోలు జారీ చేసి టీడీపీ నేతలపై కేసులు ఎత్తేశారని విమర్శించారు.