Begin typing your search above and press return to search.

దేశంలో సంతోషం కరువైందట

By:  Tupaki Desk   |   3 Aug 2015 10:12 AM GMT
దేశంలో సంతోషం కరువైందట
X
ప్రపంచ సంతోష నివేదిక-2015 ప్రకారం భారత ప్రజలు పెద్దగా సంతోషంగా లేరని తేలింది. 2012-14 మధ్య కాలానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని సర్వే చేసి రూపొందించిన ఈ నివేదికలో ప్రజల సంతోష స్థాయి ఆధారంగా 158 దేశాలకు ర్యాంకింగులు ఇచ్చారు. అందులో భారత్ స్థానం ఎంతో తెలుసా.... 117.. భారత్ లో ప్రజలు సంతోషంగా లేరనడానికి ఇదే సాక్ష్యం. ఆయా దేశాల జీడీపీ, అక్కడి సామాజిక జీవన పరిస్థితులు, ఆరోగ్యం, దాతృత్వ గుణం, అవినీతి ప్రాతిపదికలుగా సంతోష స్థాయిని గణించి నివేదిక రూపొందించారు. ఈ జాబితాలో పదికి 7.587 పాయింట్లతో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవగా 2.839 పాయింట్లతో టోగో దేశం అట్టగున 158వ స్థానంలో నిలిచింది. బురుండి, సిరియా, బెనిన్, రువాండా, ఆఫ్ఘనిస్థాన్ లు టోగో పైన ఉన్నాయి. భారత్ విషయానికొస్తే పదికి 4.565 పాయింట్లతో 117వ స్థానంలో ఉంది.

2015 ప్రపంచ సంతోష నివేదికలో అగ్రరాజ్యం అమెరికాకు 15వ స్థానం.. మన పొరుగునే ఉంటూ అభివృద్ధి పరుగులు తీస్తున్న చైనాకు 84వ స్థానం దక్కాయి. ఇంకో పొరుగు దేశం పాకిస్థాన్ 81వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని నిర్మిస్తున్న సింగపూర్ 24వ స్థానంలో ఉంది. కాగా ఈ నివేదిక రూపకల్పనలో మానవాభివృద్ధి సూచి, ఆయా దేశాల్లో శాంతిభద్రతలు, అంతర్యుర్ధాలు, ఉగ్రవాదం వంటివన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నివేదికలో దేశాలకు ఇచ్చిన ర్యాంకింగులను పరిశీలిస్తే మానవాభివృద్ధి సూచిలో ఆయా దేశాల స్థానంతో సామీప్యం కనిపిస్తోంది. సంతోష స్థాయిలపై తొలి నివేదిక 2012లో ఇవ్వగా... రెండో నివేదిక 2013లో.. మూడోది 2015లో విడుదల చేశారు.

అత్యంత సంతోషంగా ఉన్న దేశాల్లో తొలి పది ఇవే...
1. స్విట్జర్లాండ్
2. ఐస్ లాండ్
3. డెన్మార్క్
4. నార్వే
5. కెనడా
6. ఫిన్లాండ్
7. నెదర్లాండ్స్
8. స్వీడన్
9. న్యూజిలాండ్
10. ఆస్ట్రేలియా