యూఎస్ రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి మృతి

Fri May 19 2017 11:32:41 GMT+0530 (IST)

రోడ్ల రక్తదాహానికి నిత్యం పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిర్లక్ష్యం.. అమిత వేగం.. వెరసి మనుషులు విలువైన ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి. తాజాగా ఒక తెలుగు మహిళ.. అమెరికాలో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు.  హెన్నీ కౌంటీలో నివాసం ఉంటున్న తనికెళ్ళ శంభుప్రసాద్ సతీమణి నాగమణి  టీచర్ గా పని చేస్తున్నారు. న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి తీవ్ర గాయాలకు గురయ్యారు.

ఆసుపత్రికి తరలించిన ఆమెకు చికిత్స చేస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆటా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేప్టటారు.

మరోవైపు న్యూయార్క్ నగరంలో ఒక కారు విధ్వంసాన్ని సృష్టించింది. రోడ్డు మీద నడుస్తున్న పాదచారులపైకి దూసుకెళ్లిన కారు ఉదంతంలో ఒకరు మరణించగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో ఇంత దారుణానికి కారణమైన కారు డ్రైవర్ రిచర్డ్ రోజస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

న్యూయార్క్ నగరంలోని సెవెంత్ ఎవెన్యూ 45వ వీధి వద్ద ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో కారు పాదచారుల వైపు దూసుకెళ్లింది. ఊహించని ఈ పరిణామంతో పాదచారులు పరుగులు తీశారు. అరుపులు.. కేకలతో పాటు వేగంగా దూసుకెళ్లిన కారు కారణంగా గాయపడిన వారితో అక్కడ భీతావాహా పరిస్థితి నెలకొంది.

ఈ అనూహ్య పరిణామంలో తీవ్రంగా గాయపడిన ఒకరు మరణించగా.. మరో 22 మందికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఉదంతం ప్రమాదవశాత్తు చోటు చేసుకుందా? ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/