Begin typing your search above and press return to search.

బూతు లేకున్నా బ్లాక్ చేసేశారు

By:  Tupaki Desk   |   4 Aug 2015 10:04 AM GMT
బూతు లేకున్నా బ్లాక్ చేసేశారు
X
బూతు వెబ్ సైట్లను నిషేధించలేదు.. నిఘా మాత్రమే పెట్టామని చెబుతున్న కేంద్రం ఈ విషయంలో కాస్త అత్యుత్సాహం కూడా ప్రదర్శించినట్లుగా ఉంది. పోర్ను వెబ్ సైట్లను బ్లాక్ చేయడంలో భాగంగానే కొన్ని మంచి వెబ్ సైట్లకూ ఇబ్బంది సృష్టించింది. ఏమాత్రం పోర్ను కంటెంట్ లేనప్పటికీ కొన్ని సైట్లు ఆగిపోయాయి. అంతర్జాతీయంగా మంచిపేరున్నవి... టాప్ రేటెడ్ సైట్లూ ఇలా ఇబ్బందిపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వెబ్ ట్రాఫిక్ ఆధారంగా ర్యాంకింగులు ఇచ్చే అలెక్సా.కామ్ ర్యాంకింగుల్లో టాప్ 1000లో ఉన్న పోర్టళ్లూ పోర్ను కంటెంటు లేకున్నా బ్లాకయ్యాయి.

కాలేజ్ హ్యూమర్.కామ్ ఎంత పాపులర్ పోర్టల్ లో అందరికీ తెలిసిందే. చిన్నచిన్న కామెడీ వీడియోలుండే ఈ సైట్ కు మంచి ఆదరణ ఉంది. అలెక్సా రేటింగ్ ప్రకారం ఇది వెయ్యి లోపు ర్యాంకుల్లోనే ఉంది. ఇది ఎక్కువగా యువతకు, కాలేజి కుర్రాళ్లకు నచ్చేలా కామెడీ వీడియోలు ఉంచుతుందే తప్ప బూతు వీడియోలు ఉండవు. కానీ, ఈ సైట్ ను కూడా తెరుచుకోకుండా చేశారు. మరోవైపు ఇంకొన్ని సైట్లలో అంతా బాగానే ఉన్నా వీడియోలు మాత్రం ఓపెన్ కావడం లేదు. 9జీఏజీ.కామ్ వెబ్ సైట్ ప్రపంచవ్యాప్తంగా 198వ ర్యాంకు ఇండియాలో 132వ ర్యాంకులో ఉంది. ఇందులో నవ్వు తెప్పించే సన్నివేశాలు తప్ప ఇంకేమీ ఉండవు. కానీ దీన్ని ఆపేశారు. ఇలా చాలా వెబ్ సైట్లు బూతుతో సంబంధం లేకపోయినా బుక్కయిపోయాయి. అయితే... ఇలాంటి కామెడీ సీన్లు, ఇతర వీడియోలు ఉండే యూట్యూబ్ మాత్రం బ్రహ్మాండంగా ఓపెనవుతోంది. అంతేకాదు... యూట్యూబ్ లో 18 ప్లస్ ఏజ్ అని నిర్ధారించి సైట్లో లాగినైతే హాట్ హాట్ వీడియోలు కూడా ఓపెనవుతున్నాయి.

shitbrix.com.... barstool sports అనే బ్లాగు కూడా ఈ బ్లాక్ లిస్టులో పడి ఇబ్బందులుపడుతోంది. టెలికాం శాఖ సరైన విధానం.. పక్కా ప్రణాళిక లేకుండా చేయడం వల్లే ఇలా జరిగినట్లు చెబుతున్నారు. ఇండోర్ కు చెందిన కమలేశ్ వస్వానీ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా చర్యలు తీసకుంటున్న ప్రభుత్వం మొత్తం 857 సైట్లపై వేటేసింది. అయితే... కొన్ని మంచి వెబ్ సైట్లు కూడా బ్లాకయిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.