Begin typing your search above and press return to search.

వందేళ్లకు కానీ మనకు చేసిన పాపం తెల్లోళ్లకు అర్థం కాలేదు

By:  Tupaki Desk   |   12 April 2019 8:53 AM GMT
వందేళ్లకు కానీ మనకు చేసిన పాపం తెల్లోళ్లకు అర్థం కాలేదు
X
చేసిన పాపం ఉత్తనే పోదు. అహంభావానికి నిదర్శనంగా.. తెల్లోళ్ల దుర్మార్గాలకు ఉదాహరణగా నిలుస్తుంది జలియన్ వాలా బాగ్. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఒకచోట సమావేశమైన వారిపై అమానుషంగా కాల్పులు జరిపి తెల్లోళ్ల రికార్డుల ప్రకారం 400 మందిని హత్య చేసిన బ్రిటీషర్ల పైశాచికత్వానికి నిలువెత్తు రూపంగా.. నిలుస్తుంది జలియన్ వాలా బాగ్ ఉదంతం.

భారత దేశ రికార్డుల ప్రకారం ఈ ఊచకోతలో వెయ్యిమందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతారు. ఈ దుర్మార్గానికి వందేళ్లు గడిచిన వేళ.. నాడు జరిగిన ఊచకోతకు నేడు విచారం వ్యక్తం చేశారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే.

ఏప్రిల్ 13 నాటికి జలియన్ వాలా బాగ్ దురాగతం చోటు చేసుకొని వందేళ్లు కానున్న నేపథ్యంలో.. బ్రిటన్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పార్లమెంటులో మాట్లాడిన థెరిసా.. జలియన్ వాలా బాగ్ ఉదంతంపై విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్.. ఇండియన్ చరిత్రలో ఇదో మాయని మచ్చగా ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే.. ఈ ఉదంతంపై పూర్తిస్థాయి క్షమాపణ మాత్రం ఆమె మాటల్లో వినిపించకపోవటాన్ని చూస్తే.. తెల్లోళ్ల అహంకారం ఇంకా తగ్గలేదని చెప్పక తప్పదు. ప్రధాని థెరిసా ప్రసంగిస్తున్న వేళ.. విపక్ష లేబర్ పార్టీ నేత జెరెమై కార్బెన్ జోక్యం చేసుకుంటూ ఈ ఘటనపై విస్పష్ట క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా.. థెరిసా మాత్రం ఆయన వినతికి సానుకూలంగా స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. బ్రిటిష్ పాలకుల ఊచకోతకు బలైన వందలాది అమరవీరుల స్మృత్యర్థం పలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే బ్రిటన్ ప్రధాని ఈ ఉదంతంపై విచారం వ్యక్తం చేయటం గమనార్హం. దుర్మార్గ ఘటనకు పాల్పడిన వందేళ్లకు విచారం వ్యక్తం చేస్తున్న తెల్లోళ్లు.. మరో వందేళ్లకు క్షమాపణలు చెబుతారేమో? నాగరిక సమాజంలోనూ చేసిన తప్పునకు గట్టిగా చెంపలేసుకుంటే వచ్చే నష్టమేందో? అంత అహంకారం ఏందుకో?