Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్ద‌రు స్వాములు ప‌వ‌ర్ ఫుల్!

By:  Tupaki Desk   |   24 May 2019 7:59 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్ద‌రు స్వాములు ప‌వ‌ర్ ఫుల్!
X
తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ చూడ‌ని స‌న్నివేశం రానున్న రోజుల్లో చూడ‌నున్నాం. ఇద్ద‌రు స్వామీజీలు రెండు తెలుగు రాష్ట్రాల్ని పూర్తిస్థాయిలో ప్ర‌భావితం చేయ‌నున్నారు. తెలుగు రాష్ట్రాల‌కు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క రాజ‌కీయాల్ని అక్క‌డి మ‌ఠాలు ప్ర‌భావితం చేస్తుంటాయి. అలాంటి తీరు తెలుగు రాష్ట్రాల్లో క‌నిపించ‌దు.

అయితే.. అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్ద‌రు స్వామీజీలు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని త‌మ మాట‌ల‌తో ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స్వాముల‌కు పెద్ద పీట వేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముందుంటారు. పూజ‌లు.. పున‌స్కారాలు.. న‌మ్మ‌కాలు..వాస్తు లాంటి వాటికి అమిత ప్రాధాన్య‌త ఇవ్వ‌టం కేసీఆర్ కు అల‌వాటు. చిన‌జీయ‌ర్ స్వామి అంటే కేసీఆర్ కు ఎంత గురో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మాట‌కు ఆయ‌న ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు.

ఈ మ‌ధ్య‌న చిన‌జీయ‌ర్ స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని.. ఆయ‌న ఆశీస్సుల్ని పొందారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.అయితే.. ఆయ‌నీ ప‌ని చేయ‌టానికి కార‌ణం కేసీఆర్ సూచ‌న‌తోనే అని చెబుతారు. ఇటీవ‌ల రెవెన్యూ ఉద్యోగులు చిన‌జీయ‌ర్ నుక‌లిసి.. త‌మ స‌మ‌స్య‌ల విన‌తిప‌త్రాన్ని స్వామీజీకి ఇచ్చి.. సీఎం దృష్టికి తీసుకెళ్లాలే చేయాల‌ని కోర‌టం మ‌ర్చిపోకూడ‌దు.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ కు చిన‌జీయ‌ర్ తో పాటు విశాఖ శ్రీ‌శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి అంటే కూడా న‌మ్మ‌కం. ఆ మ‌ధ్య‌న ఒడిశా వెళ్లే క్ర‌మంలో కేసీఆర్‌.. విశాఖ‌లో ఆయ‌న ఆశ్ర‌మానికి వెళ్ల‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అదే స‌మ‌యంలో.. స్వ‌రూపానంద స్వామీజి జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడే కాదు.. ఆయ‌న‌కు అధికారం ప్రాప్తించాలంటూ పెద్ద యాగం చేయ‌టంతో పాటు.. ప‌లు క్ర‌తులు చేయించిన‌ట్లుగా చెబుతారు. తాజాగా వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తాము అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్న వేళ‌.. ప‌లువురు ప్ర‌ముఖులు జ‌గ‌న్ కు ఫోన్ చేస్తే.. జ‌గ‌న్ మాత్రం స్వ‌రూపానంద స్వామీజీకి ఫోన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీ త‌న‌కు చేసిన సాయాన్ని త‌న జీవితంలో ఎప్ప‌టికి మ‌ర్చిపోలేన‌ని పేర్కొన్న‌ట్లుగా శార‌దాపీఠం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌టం దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని ఈ ఇద్ద‌రు స్వామీజీలు ప్ర‌భావితం చేసే స‌త్తా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.