Begin typing your search above and press return to search.

కాషాయం తీర్థం పుచ్చుకున్న పరిపూర్ణానంద!

By:  Tupaki Desk   |   19 Oct 2018 12:53 PM GMT
కాషాయం తీర్థం పుచ్చుకున్న పరిపూర్ణానంద!
X
కొద్ది రోజులుగా వ‌స్తోన్న ఊహాగానాలు నిజ‌మ‌య్యాయి. అంద‌రూ అనుకున్న‌ట్లుగానే శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆధ్వ‌ర్యంలో ఆయ‌న కాషాయం కండువా క‌ప్పుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో పాటు ఢిల్లీ వెళ్లిన స్వామి....బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడంపై పరిపూర్ణానంద హర్షం వ్యక్తం చేశారు. మ‌రోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగుతోంది మ‌రోవైపు, రేపు ఢిల్లీలో పార్లమెంట్‌ బోర్డ్‌ మీటింగ్‌లో 30 మంది అభ్యర్థుల పేర్ల‌ను బీజేపీ అధిష్టానం ఖ‌రారు చేయ‌నుంది. ఈ క్ర‌మంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ - ఇన్ చార్జి కృష్ణదాస్‌ - మురళీధర్‌ రావు - కిషన్‌ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీకి బయలుదేరనున్నారు.

మ‌రోవైపు, ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని చాలాకాలంగా బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీ - త‌మిళ‌నాడు - కేర‌ళ‌లో పూర్తిగా విఫ‌ల‌మైన క‌మ‌ల‌నాథులు....క‌ర్ణాట‌క‌లో కొంత‌వ‌ర‌కు స‌ఫ‌ల‌మైనా అధికారం ద‌క్కించుకోలేక‌పోయారు. ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణ‌లో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు స్వామి ప‌రిపూర్ణానంద‌ను బ‌రిలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధ‌మైంది. ఆధ్యాత్మిక గురువుగా - హిందూ మ‌త ప్ర‌బోధ‌కుడిగా తెలంగాణ‌లో పాపులారిటీ ఉన్న ప‌రిపూర్ణానంద‌ను తెలంగాణ యోగి ఆదిత్య‌నాథ్ గా చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. దానికితోడు ప‌రిపూర్ణానంద కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. దీంతో, ప‌రిపూర్ణానంద స్వామి బీజేపీలో చేర‌డం సులువైంది. నిజామాబాద్ నుంచి ప‌రిపూర్ణానంద బ‌రిలోకి దిగ‌డం దాదాపుగా ఖాయ‌మైంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి.