Begin typing your search above and press return to search.

ఆ ఛాన‌ల్ ఎడిట‌ర్ ను ఎయిర్ పోర్ట్ నుంచే పంపేశారు

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:13 AM GMT
ఆ ఛాన‌ల్ ఎడిట‌ర్ ను ఎయిర్ పోర్ట్ నుంచే పంపేశారు
X
ఒక ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఒక ఛాన‌ల్ ఎడిట‌ర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి పంపేశారు. పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని బేగంబ‌జార్ లో నిర్వ‌హించిన తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి సుద‌ర్శ‌న్ న్యూస్ ఛాన‌ల్ ఎడిట‌ర్ సురేష్ చావంకే వ‌చ్చారు.

ఆయ‌న్ను ఎమ్మెల్యే రాజాసింగ్ ఆహ్వానించారు. అయితే.. చావంకేను ఎయిర్ పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు రావ‌టానికి పోలీసులు అనుమ‌తించ‌లేదు. దీంతో కొద్దిసేపు వాదులాట చోటు చేసుకుంది. పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా త‌న అడ్డా అయిన బేగంబ‌జార్లో నిర్వ‌హించాల‌నుకున్న ర్యాలీ కోసం ఛాన‌ల్ ఎడిట‌ర్ చావంకేకు ఆహ్వానం పంపారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీనికి ఓకే చెప్పిన ఆయ‌న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ కు చేరుకున్నారు.

ర్యాలీలో పాల్గొనేందుకు వ‌చ్చిన చావంకేకు ఘ‌నంగా స్వాగతం ప‌లికేందుకు త‌న అనుచ‌రుల‌తో క‌లిసి రాజాసింగ్ ఎయిర్ పోర్ట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. చావంకే వ‌స్తున్న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో ఎరైవ‌ల్ వ‌ద్ద‌కు వ‌స్తున్న చావంకేను బ‌య‌ట‌కు వెళ్ల‌టానికి అనుమ‌తించ‌లేదు. ఆయ‌న్ను ఢిల్లీకి పంపేశారు. ర్యాలీ పేరుతో ఇత‌రుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా పోలీసులు చావంకే న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

చావంకేకు ఈ త‌ర‌హా అనుభ‌వం ఇది తొలిసారి కాదు. గ‌తంలో ఆయ‌న క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ నిర్వ‌హించిన భార‌త్ బ‌చావో బ‌స్సు యాత్ర‌ను గ‌తంలో తెలంగాణ‌లోకి రాకుండా అడ్డుకున్నారు. మేమిద్ద‌రం.. మాకిద్ద‌రు.. అంద‌రికి ఇద్ద‌రు అన్న నినాదంతో కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ బ‌స్సు యాత్ర‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌ట్లో 13 రాస్ట్రాల్లో యాత్ర‌ను నిర్వ‌హించి.. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల గుండా తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంలోనూ గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. స‌రైన అనుమ‌తులు తీసుకోకుండా యాత్ర‌లు నిర్వ‌హించ‌లేరంటూ పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తే.. త‌న యాత్ర‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఉంద‌ని చావంకే అప్ప‌ట్లో వాదించారు. త‌న భార్య‌తో క‌లిసి యాత్ర‌ చేసిన ఆయ‌న‌కు తెలంగాణ‌లో ప‌ర్య‌టించాల‌న్న ఆశ తీర‌లేదు. ఇది జ‌రిగిన దాదాపు ఐదారు నెల‌ల త‌ర్వాత మ‌రోసారి హైద‌రాబాద్‌ లోకి అడుగుపెట్ట‌బోయి పోలీసుల అభ్యంత‌రాల‌తో మ‌రోసారి వెన‌క్కి వెళ్లిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పాలి.