సుమలత కోసం ఆఖరి రోజున సూపర్ స్టార్ షో?

Mon Apr 15 2019 16:27:37 GMT+0530 (IST)

ఈ సారి దక్షిణాదిన బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం మండ్య. అక్కడ నుంచి నటి సుమలత పోటీలో ఉండటంతో ఆ నియోజకవర్గం ఫలితంపై దక్షిణ భారత దేశం అంతా ఆసక్తితో ఎదురుచూస్తూ  ఉంది. ఒకవేళ సుమలత ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి ఉంటే ఇంత ఆసక్తి ఉండేది కాదేమో. అంబరీష్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.ఆమె పై  జేడీఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదం రేపారు. సుమలతపై మరింత సానుభూతి వెల్లువెత్తింది. ఇక బీజేపీ వాళ్లు సుమలతకే మద్దతు అని ప్రకటించేశారు. కాంగ్రెస్ వాళ్లు కూడా లోపాయికారీగా ఆమెకే సహకారం అందిస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక సుమలతకు పోటీగా కర్ణాటక సీఎం తనయుడు ఉండటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

ఈ సీటుకు ఈ గురువారం పోలింగ్ జరగనుంది. మంగళవారం ప్రచారానికి తుదిగడువు. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున సుమలత కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగబోతూ ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఆయన మండ్య నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టనున్నారని - సుమలతను గెలిపించాలని ఆయన పిలుపును ఇస్తూ ప్రచారం నిర్వహించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంబరీష్ - సుమలత తో ఉన్న సాన్నిహిత్యం మేరకు రజనీకాంత్ ప్రచారానికి రాబోతున్నారని అంటున్నారు.

అయితే అసలే అది కావేరి పరివాహక ప్రాంతం. కావేరీ జల వివాదాలు రేగినప్పుడు బాగా స్పందించేది మండ్య ప్రాంత రైతులే. ఇక కావేరీ జల వివాదం అప్పుడు రజనీకాంత్ తమిళుల పక్షానే ఉంటారు. మరి ఇప్పుడు రజనీకాంత్ వచ్చి సుమలతకు అనుకూలంగా ప్రచారం చేస్తే..  అది ఆమెకు మేలు చేస్తుందా? లేక మైనస్ అవుతుందా? అనే సందేహాలు కూడా నెలకొంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ రజనీకాంత్ ప్రచారం విషయంలో కూడా ఇంకా అధికారిక ప్రకటన లేదు.