Begin typing your search above and press return to search.

ట్రంప్ లాంటి షాకే ఇచ్చిన సౌదీ

By:  Tupaki Desk   |   27 Feb 2017 3:51 PM GMT
ట్రంప్ లాంటి షాకే ఇచ్చిన సౌదీ
X
అగ్ర‌రాజ్యం అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియా కూడా అదే బాటలో నడుస్తోంది. తమ దేశంలో ఎక్కువ జీతాలు తీసుకుంటూ.. స్థానికుల ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న శ్వేత జాతీయులను వారి స్వదేశాలకు సాగనంపాలని నిర్ణయించింది. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తుండగా.. సౌదీ.. శ్వేత జాతీయులపై కన్నెర్ర చేస్తోంది. ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో ఓ వెలుగు వెలిగిన సౌదీ అరేబియా.. చమురు ధరల పతనంతో చతికిలబడింది. ప్రస్తుతం చమురు ధరలు కాస్త పెరిగినా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. పైగా దేశంలో నిరుద్యోగం పెరగడం.. విదేశీయులే అధిక జీతాలు తీసుకుంటుండటంతో.. వారిపై దృష్టిసారించింది. స్థానికులకే ఉపాధి అవకాశాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో ఎక్కువ జీతాలతో ఆ దేశంలో నివాసముంటున్న విదేశీయులను వెనక్కి పంపించేస్తోంది. ఖర్చులు తగ్గించుకోవడానికి, మందకొడిగా సాగుతున్న ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా నివేదికల ప్రకారం సౌదీలో దాదాపు 90 లక్షల మంది విదేశీయులు పని చేస్తున్నారు. అయితే, ఆర్థికంగా నష్టం వాటిల్లుతుండటంతో వారిని సాగనంపుతోంది. సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సొంత దేశం జర్మనీకి వెళుతున్న డొమినిక్‌ స్టెక్‌ మాట్లాడుతూ.. సౌదీలో ఆర్థిక వృద్ధి పడిపోవటంతో ఆ రంగాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ జీతం పొందుతున్న శ్వేతజాతీయులను పంపించేందుకు సిద్ధపడిందని తెలిపారు. అయితే, ఈ నిర్ణయంతో సౌదీకి చాలా లాభమని తెలిపారు. సొంత ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆ ప్రభుత్వ నిర్ణయం కూడా వారికి లాభిస్తుందన్నారు. మరోవైపు జులై నుంచి విదేశీ ఉద్యోగులను అధికంగా కలిగి ఉన్న కంపెనీలపై పన్ను విధించాలనీ ఈ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ట్రంప్ ఎత్తుగ‌డ ఆ దేశానికే కొంద‌రు తెల్ల‌జాతీయుల‌కే చిక్కుగా మారుతోంద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/