ఎన్టీఆర్ పై చెప్పల దాడి :గుర్తు చేసుకున్నఫైర్ బ్రాండ్

Thu Feb 22 2018 22:17:55 GMT+0530 (IST)

టీ కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి వైశ్రాయ్ ఘటనను గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి సంఘాల నాయకురాలిగా ఉన్న రేణుకా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో తీర్ధం పుచ్చుకున్నారు. అయితే నాటి చేదు జ్ఞాపకాల్ని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. వైశ్రాయ్ హోటల్లో ఏం జరిగింది. తాను ఆ సమయంలో ఎక్కుడున్నారనే విషయాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను వైస్రాయ్ హోటల్ వద్ద అవమానించిన ఘటన తన జీవితంలో చాల ఆవేదనకు గురిచేసిందని అన్నారు.  ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నట్లు హైదరాబాద్ లో ఉంటే పరిస్థితి రాకుండా చూసేదానిని అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.అయితే రేణుకా చౌదరి చెప్పిన వైశ్రాయ్ ఘటనపై  రాజకీయంలో తల పండిన నేతలు అనేక వివరాల్ని వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా రేణుకా చౌదరి ఢిల్లీలో ఉన్నప్పుడు హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది అనే విషయంపై విశ్లేషిస్తే..

 సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ 1982 మార్చ్ 29న  టీడీపీని స్థాపించారు. తన నాయకత్వంలో మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటికే అల్లుడిగా ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండే కీలక నేతల్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే  1992లో ఎన్టీఆర్‌కు గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 1993లో ఒంటిరిగా ఎన్న ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. దీన్ని అదునుగా భావించిన చంద్రబాబు క్యాంపు ఎన్టీఆర్ భాగస్వామి లక్ష్మీపార్వతి ప్రమేయం బాగా పెరిగిపోతుందని  ప్రచారం చేయడంలో విజయం సాధించింది. దీంతో  అనారోగ్యంతో సమయంలో చంద్రబాబు క్యాంపు ప్రచారం చేయడంతో ఎన్టీఆర్‌ను బలహీన పరిచిందని అప్పటి రాజకీయ నిపుణులు గుర్తు చేసుకుంటున్నారు.

 1994 ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి ఏపీలోని 294 స్థానాలలో పోటీ చేస్తే  216 సీట్లు గెలుచుకుంది. పార్టీని కార్యక్రమాలు నేతలు రోడ్ షోలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ 1995 ఆగస్టులో తొమ్మిది రోజులపాటు నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం టీడీపీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోశారు.

ఆ సమయంలోఎన్టీఆర్- లక్ష్మీ పార్వతి- మంత్రులు నర్సింహులు - దామోదర్ రెడ్డి - పరిటాల రవి లు  చైతన్యరథంతో వైశ్రాయ్ హోటల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వైస్రాయ్ హోటల్ లో గుమికూడిన చంద్రబాబు మద్దతుదారులు రోడ్డు మీద చైతన్య రథంపై ఉన్నఎన్టీఆర్ పైకి చెప్పులు విసిరారు. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో చైతన్యరథంపై ఉన్న ఎన్టీఆర్ ను ఆయన అనుచరులను చూడగానే హోటల్ లో వేచి ఉన్న  సుమారు వెయ్యిమంది బాబు మద్దతు దారులు ఎన్టీఆర్ డౌన్ డౌన్ వెనక్కి వెళ్లిపోవాలని గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం ఆయనపైకి చెప్పులు విసిరారు.

అ సమయంలో టీడీపీకి చెందిన 216 మంది ఎమ్మెల్యేలలో 198 మంది ఎమ్మెల్యేలు అండగా నిలువడంతో ఐదు రోజుల తర్వాత చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టారు. కేవలం 18మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్టీఆర్‌కు విశ్వాసపాత్రులుగా నిలబడ్డారు. వారిలో మంత్రులుగా ఉన్న నర్సింహులు రాజశేఖర్ చంద్రశేఖర్ - బుచ్చయ్య చౌదరి - గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉన్నారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలతో కలత చెందిన ఎన్టీఆర్ గవర్నత్ భేటీ అయ్యారు. పార్టీ గురించి చర్చించారు. ఓ వైపు చంద్రబాబు మద్దతు దారులు పొడిచిన వెన్నుపోటుకి ఎన్టీఆర్ కు అండగా  ఉన్న ఆ 18మంది ఎమ్మెల్యేలు ఖిన్నవదనులై కంటతడి పెట్టడం ప్రతీఒక్కర్ని కలవారినికి గురిచేసింది.  

 ఈ పరిణామంతో గుండెపగిలిన ఎన్టీఆర్ తీవ్ర విషణ్న వదనంతో పదవీచ్యుతుడై హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన ఇంటికి తిరుగుముఖం పట్టారు.

అనంతర కాలంలో ఎన్టీఆర్ కు మద్దతుగా ఉన్న 18మంది ఎమ్మెల్యేలలో చాలామంది చంద్రబాబు పక్షాన చేరిపోయారు.

దీంతో సొంత అల్లుడే తనను వెన్నుపోటు పొడవడంతో దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును వెన్నుపోటుదారుడు - ఔరంగజేబు అంటూ తీవ్ర విమర్శించిన విషయాన్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. అప్పట్లో ఈ ఉదంతంలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచింది.  కానీ ఆ తర్వాత చంద్రబాబు తీరు నచ్చక చాలావరకు ఎన్టీఆర్ కుటుంబం దూరం జరిగింది. ఇప్పటికీ ఎన్టీఆర్-చంద్రబాబు కుటుంబాల మధ్య నివురుగప్పిన నిప్పులా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉన్నట్టు కనిపిస్తుందని పరిశీలకులు చెప్తారు.

ఆ వైశ్రాయ్ ఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నట్లు రేణుకా చౌదరి తెలిపారు. ఎన్టీఆర్‌ను నమ్మిన వారే మోసం చేశారని.. ఇంతలా మోసం చేస్తారని ఎన్టీఆర్ ఊహించలేదని రేణుకా చౌదరి చెప్పారు.