Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఊహించ‌ని అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   8 Nov 2018 2:38 PM GMT
కేసీఆర్‌ కు ఊహించ‌ని అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్
X
రేగులపాటి ర‌మ్యారావు...టీపీసీసీ అధికార ప్ర‌తినిధి. అనేక మంది కాంగ్రెస్ నాయ‌కులు ఉండ‌గా ఆమె గురించి ఎందుకు ప‌రిచ‌యం చేయాల్సి వచ్చిందంటే...టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అన్న కూతురు కాబ‌ట్టి! కేసీఆర్ అన్న కూతురు కాంగ్రెస్‌ లో చేర‌డం - పైగా ఇంత‌టి ముఖ్య‌మైన ప‌ద‌విలో ఉండ‌ట‌మే ఆస‌క్తిక‌రం అయితే,..అంత‌కంటే ఆశ్చ‌ర్య‌క‌రం ఏమిటంటే రమ్యారావు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్రబాబునాయుడ్ని కలుసుకున్నారు. అమరావతి వెళ్లిన కేసీఆర్ అన్న కూతురు ఉండవల్లిలోని సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న రమ్యారావు బాబుతో స‌మావేశం అవ‌డం స‌హ‌జంగానే రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

సంచ‌ల‌న వార్త‌ల‌కు చిరునామాగా ఉండే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి - కేసీఆర్ అన్న‌కూతురు అయిన రేగులపాటి రమ్యారావు గ‌తంలో క‌ల‌కంల రేపే వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చుట్టూ త‌మిళ‌నాడులో సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కార‌ణ‌మైన శ‌శిక‌ళ వంటి కోట‌రి ఉంద‌ని - చిన్న‌మ్మ సార‌థ్యంలో న‌డిచి మ‌న్నార్ గుడి మాఫియా కుట్ర‌ల‌వలే కేసీఆర్‌ పై సైతం జ‌రిగే అవకాశం ఉంద‌ని ఆరోపించారు. తమిళనాడులో మన్నారుగుడికి చెందిన‌ శశికళ కోటరీ జయలలితను పొట్టన పెట్టుకుంటే .. తెలంగాణ లో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియా పొట్టన బెట్టుకునే ప్రమాదం ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. కుదురుపాక శశికళ వర్గానికి ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యురిటీ ఎలా కలిపిస్తారని ఇటీవ‌ల ఎంపీ క‌విత‌కు భ‌ద్ర‌త పెంపు నిర్ణయాన్ని ర‌మ్య ప్ర‌శ్నించారు. కుదురుపాక మాఫియా నుంచి సీఎం ప్రాణాలను ఏ ఇంటిలిజెన్స్ కాపాడుతోందో చూడాలని వ్యాఖ్యానించారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆమె బ‌రిలో దిగాల‌ని భావిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి కరీంనగర్ జిల్లాలోని వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలని రమ్యారావు భావిస్తున్నారు. అయితే, ఆమెకు టికెట్ ద‌క్కే అవ‌కాశాలు మృగ్య‌మ‌య్యాయి. పార్టీలో కొందరు నేతల తీరుతో ఆమె మనస్తాపం చెందారు. ఈ పరిస్థితుల్లో ఆమె చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. అమ‌రావ‌తిలో జ‌రిగిన ఈ స‌మావేశంలో తనకు టికెట్ వచ్చేలా సహకరించాలని చంద్రబాబును రమ్యారావు కోరారు. అయితే, ఈ భేటీ ఆస‌క్తికరంగా మారింది. మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే...ప‌రిపాల‌న అంతా అమ‌రావ‌తిలోని చంద్ర‌బాబు కేంద్రంగా జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్న స‌మ‌యంలో సాక్షాత్తు టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్న‌ కుమార్తె చంద్ర‌బాబును క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదే స‌మ‌యంలో త‌మ‌కు కాంగ్రెస్ పార్టీయే స్వ‌యంగా అస్త్రం అందించింద‌ని టీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చించుకోవ‌డం కొస‌మెరుపు.