కడప ఉక్కును అడ్డుకుంది బాబే - పవన్ !

Sun Jun 24 2018 22:29:57 GMT+0530 (IST)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో హాట్ హాట్ గా సాగుతున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అధికార తెలుగుదేశం పార్టీ మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేశారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ పర్సంటేజీలిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో  పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతి లభిస్తుందని కొందరు విదేశీ పారిశ్రామిక వేత్తలు తనతో చెప్పారని తెలిపారు.  రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని జిందాల్ సంస్థ తనతో చెప్పిందని కానీ రాష్ట్రంలో పరిస్థితి అనకూలించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలని కానీ ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలను పీడించి దోచుకుంటున్నాయని విమర్శించారు.  కాగా విజయవాడ జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సీపీఐ రామకృష్ణ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మీద ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ప్రజల సమస్యలు మీద ఉమ్మడి గా కదులుతామని తెలిపారు.కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగేళ్ల పాటు చడీచప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఆందోళన చేయడం ఏంటని పలు వర్గాల నుంచి సహజంగానే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికీ టీడీపీ తనదైన శైలిలో ముందుకు సాగిపోయింది. ఇలా హాట్ హాట్ గా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా ఇవాళ విజయవాడలో పవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  `రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వం ప్రజలకి అండగా నిలవాల్సిన ప్రభుత్వలు ప్రజలను మోసం చెయ్యటం వ్యక్తిగతంగా నాకు చాలా బాధ కలిగింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలను రకరకాలుగా పీడించి దోచుకుంటుంది రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు` అని వ్యాఖ్యానించారు.

ఇపుడు ఉక్కు పరిశ్రమ కోసం హడావుడి చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారని పవన్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. ``ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం గోల చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారు. తమకి లబ్ది చేకూరదనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకున్న నేతలు ఇపుడు లబ్ది చేకూరితే పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమే అంటున్నారు. జిందాల్ సంస్థ తాము ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని నాతో చెప్పింది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు..దిగజారిపోయిన పరిస్థితి.పర్సెంటేజీలు ఇస్తేనే పరిశ్రమల ఏర్పాటు అవుతుందని విదేశాల్లో కొందరు పారిశ్రామిక వేత్తలు చెప్పారు. అదే జరిగితే నిరుద్యోగం పెరిగి ప్రాంతీయ అసమానతలు వస్తాయి. `` అని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని పవన్ అన్నారు. ప్రజలకు క్లీన్ గవర్నెన్స్ వస్తుందని టీడీపీకి మద్దతు ఇచ్చా అది జరగక పోవటంతో విభేదించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీజేపీ కూడా విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టే బయటకు వచ్చామన్నారు. తమతో ఎవరు కలిసి వస్తే వాళ్ళతో వెళతామని పవన్ వెల్లడించారు. వామపక్షాలవి తనవీ ఒకే ఆలోచన అని పేర్కొన్నారు. మూడు నెలల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు.