వైసీపీలోకి నేదురుమల్లి వారసుడు!

Thu Aug 09 2018 22:09:14 GMT+0530 (IST)

వైసీపీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన `ప్రజా సంకల్ప యాత్ర`కు విశేష ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని - జగన్ సీఎం అవుతారని వైసీపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీ నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. దానికి తోడు టాలీవుడ్ నుంచి పోసాని - పృధ్వి లతోపాటు కొందరు సెలబ్రిటీలు కూడా వైసీపీకి జై కొట్టారు. దీంతో వైసీపీ బలం నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలకమైన నేత వైసీపీలో చేరబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతునన్నట్టు ప్రకటించారు. గురువారం నాడు కార్యకర్తలతో సమావేశమైన ఆయన...ఈ నిర్ణయం తీసుకున్నారు.రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాను పార్టీ మారే అంశంపై చర్చించేందుకు రామ్ కుమార్ రెడ్డి ....కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు - కార్యకర్తలతో రామ్ కుమార్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డిని వైసీపీలో చేరాలని అనుచరులు - అభిమానులు ఒత్తిడి తెచ్చారు. దీంతో తన అనుచరులు - అభిమానుల అభీష్టం ప్రకారం తను త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరముందని అన్నారు. వైసీపీ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. నేదురుమల్లి అభిమానులందరు తనతో కలిసి నడవాలని కోరారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి వైసీపీలో చేరతానని స్వయంగా ప్రకటించారు.