ముద్రగడ మళ్లీ అదే పనిచేశారు

Thu Jan 12 2017 15:39:40 GMT+0530 (IST)

కాపు నేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చేందుకు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు తమ కాపు కులస్తులతో మాత్రమే కలిసి పోరాడిన ముద్రగడ ఇటీవల తన పంథా మార్చి బీసీ నేతలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు. అందులో మరో ముందడుగు వేసి ఎస్సీ నేతలను సైతం భాగస్వామ్యం చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ టీవీ రామారావుతో  ఆయన స్వగృహంలో ముద్రగడ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పోరాట పంథాను వివరించారు.

కాపులకు రిజర్వేషన్ ఇస్తామని స్వయంగా ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇపుడు అదే డిమాండ్ తో చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. అయితే కాపులకు కోటా కల్పించేవరకూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కాపు ఉద్యమానికి మద్దతు కోరేందుకు బీసీ - దళిత నాయకులను కలిసే కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మద్దతు కోరేందుకు వచ్చామని ముద్రగడ తెలిపారు. ఈ నెల 26న సత్యాగ్రహ పాదయాత్రను రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకూ నిర్వహిస్తామన్నారు. శాంతియుతంగా నిర్వహించే పాదయాత్రకు ఎందుకు అడ్డంకులు పెడుతున్నారో అర్థం కావడం లేదని ముద్రగడ విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది టీడీపీ నాయకులు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని కాపు సోదరులు ఆ విమర్శలను నమ్మే స్థితిలో లేరని ముద్రగడ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ.. కాపు ఉద్యమానికి దళితులు మాదిగల మద్దతు ఉంటుందని ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/