Begin typing your search above and press return to search.

బాబు మరోసారి మోడీ దగ్గర ఇరుక్కుపోయారా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 11:05 AM GMT
బాబు మరోసారి మోడీ దగ్గర ఇరుక్కుపోయారా?
X
ఇప్పటికే ఒకసారి ఓటుకు నోటు వ్యవహారంలో పొరుగు రాష్ర్టం తెలంగాణ సీఎం చేతికి చిక్కుకుపోయి విలవిలలాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి ఏకంగా ప్రధాని మోడీకి చేతికి చిక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే... అందులో నేరుగా ఆయన ప్రమేయం లేకపోయినా టీడీపీ ఎమ్మెల్యేల దందాల కారణంగా చంద్రబాబు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా రాపూరు- కృష్ణపట్నం మధ్య రైల్వే పనుల విషయంలో రూ. 5కోట్లు లంచం డిమాండ్ చేస్తూ ఆడియో - వీడియో టేపుల్లో దొరికిపోయిన టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహారం మోడీ వద్దకు చేరినట్లు చెబుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే దందాను తెలుగు మీడియా మేనేజ్ చేసేసినా ఈ అంశం మాత్రం కేంద్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుమారుడు శివకుమార్ కూడా గుంటూరు జిల్లాలో ఇలాగే రైల్వే పనులు అడ్డుకున్న నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న దానిపై ఆరా తీస్తోంది.

అయితే.. ఇది ప్రధాని మోడీ వద్దకు చేరడానికి కారణాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణ లంచం అడిగిన కంపెనీ గుజరాత్ కు చెందింది. మాంటెకార్లో అనే ఆ కంపెనీని ఆయన లంచం కోసం తెగ ప్రెజర్ చేశారట. కాంట్రాక్ట్‌ సంస్థది గుజరాత్‌ అయినా సరే, ఆ కంపెనీ పెద్దలు మోదీకి బంధువులైనా సరే తమ వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ బ్యాచ్ వెంటపడడంతో కంపెనీ వర్గాలు సీరియస్ గా తీసుకుని స్టింగ్ ఆపరేషన్లో బుక్ చేశాయి. అంతేకాదు... ఏపీలో రైల్వే పనులు చేయడం పెద్ద చాలెంజ్‌ గా తయారైందని ఇప్పటికే రైల్వే బోర్డు అధికారులు కూడా కేంద్రం దృష్టికి తెచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఏపీ సీఎస్‌ కు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఘాటుగా లేఖ రాశారట. గుంటూరు జిల్లా సత్తెనపల్లి - నర్సరావుపేటల్లో రైల్వే పనులు చేయాలో వద్దో స్పష్టం చేయాలని లేఖరాసింది. అయినా సరే టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా రూ. 5కోట్లు డిమాండ్ చేస్తూ పట్టుబడడంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. సదరు కాంట్రాక్టు కంపెనీ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు విషయం చేరవేసిందని చెబుతున్నారు.