Begin typing your search above and press return to search.

జాద‌వ్‌ ను ఉరి తీసేయండి..కోర్టులో పిటిష‌న్

By:  Tupaki Desk   |   28 May 2017 5:26 PM GMT
జాద‌వ్‌ ను ఉరి తీసేయండి..కోర్టులో పిటిష‌న్
X
ప‌ర‌స్ప‌రం శాంతియుతంగా క‌లిసిమెల‌సి మెలుగుదామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ఎప్ప‌టికీ రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌నలు చేసే పాకిస్తాన్ పాల‌కుల రీతిలో ఆ దేశంలోని ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌ భూషణ్‌ జాదవ్‌ ను త్వరగా ఉరి తీయాలని ఆ దేశ సెనెట్ చైర్మ‌న్ హోదాలో ప‌నిచేసిన వ్య‌క్తి పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కుల్ భూష‌ణ్ జాద‌వ్‌ను వెంట‌నే ఉరితీయాల‌ని, ఈ విష‌యంలో త‌గు ఆదేశాల వెలువ‌రించాల‌ని కోరుతూ సెనేట్ మాజీ ఛైర్మన్‌, న్యాయవాది ఫరూఖ్‌ నక్ పాక్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని కోరారు.

త‌మ దేశంలో గూఢచర్యం చేస్తున్నందున జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పట్టుకున్నట్లు చెబుతున్న పాకిస్తాన్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించినందుకు జాద‌వ్‌పై కేసు పెట్టింది. దీన్ని విచారించిన పాక్‌ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. అయితే జాద‌వ్ విష‌యంలో పాక్ చ‌ర్య‌ను భార‌త‌దేశం త‌ప్పుప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ జాద‌వ్ విష‌యంలో పాకిస్తాన్ విన‌క‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం తదుపరి విచారణ జరిపేంత వరకు పాక్‌ జాదవ్‌కు మరణశిక్ష వాయిదా వేయాలంటూ స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో పాక్ సెనెట్ మాజీ చైర్మ‌న్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి ఉరిశిక్ష కోసం అప్పీల్ చేశారు.

ఈ సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఆదేశాల‌కు సైతం ఆ న్యాయ‌వాది కొత్త భాష్యం చెప్పడం గ‌మ‌నార్హం. జాద‌వ్ విష‌యంలో స్వేచ్ఛ‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని, అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం చ‌ట్టాలు ఈ విష‌యంలో ప్ర‌భావం చూప‌బోవ‌ని వివ‌రించారు. కోర్టు త‌న పిటిష‌న్‌ను విచారించి త‌గు న్యాయం చేస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు పాక్ న్యాయ‌వాది తెలిపారు.