తెలంగాణాకు ‘నల్గొండ’ సీఎం..ఇంట్రస్టింగ్

Mon Jul 16 2018 16:39:24 GMT+0530 (IST)

ప్రాంతం గొప్పతనం అంటే అదే.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే ఎక్కువ.. నారా చంద్రబాబు నాయుడు కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ సీమ నుంచి వచ్చిన వారే.. అంతకుముందు కూడా చాలా మంది సీఎంలు సీమ నుంచే పోటీచేసి గెలిసి ముఖ్యమంత్రులుగా గెలిచారు. ఆయా ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేశారు.  ఇప్పుడు ఎన్ని‘కలల’ మేనియా వచ్చేసింది. ముందస్తు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికలు తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదల కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.

పోయిన సారి ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలో టీఆర్ ఎస్ అంతో ఇంతో సీట్లు సాధించిన నల్గొండ జిల్లాలో మాత్రం చతికిలపడింది. జానారెడ్డి - కోమటి రెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్లంతా నల్గొండ జిల్లాలో టీఆర్ ఎస్ ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ ను నిలువరించేందుకు సమాయత్తమవుతున్నారు.

తాజాగా నల్గొండ పూర్వపు జిల్లాలోని భువనగరి జయలక్ష్మి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - పొన్నాల లక్ష్మయ్య - మల్లు రవి - తదితర కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. పాత నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని స్పష్టం చేశారు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల చూపంతా ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజల వైపు ఉందని.. ఇక్కడ గెలిచిన వారే సీఎం అవుతారంటూ తమ ముఖ్యమంత్రి ఆకాంక్షను వెల్లగక్కారు.

అంచనాలుండడం.. ఆశలుండడం సహజమే.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ముందుండి నడిపించే నాయకుడే కనిపించడం లేదు. తాజాగా సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం అంజన్ కుమార్ యాదవ్-అజారోద్దీన్ మధ్య పంచాయతీ నడుస్తోంది. కాంగ్రెస్ లో వర్గవిభేదాలు - ఆదిపత్యపోరు నడుస్తోంది.. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేసారి గెలుస్తారో లేదో కూడా చెప్పలేం. అలాంటి సమయంలో ఆశపడ్డ ఎమ్మెల్యేలను వదిలి నల్గొండ జిల్లాకే సీఎం పీఠం అని ప్రకటన చేసిన కోమటిరెడ్డి ప్రసంగం సభలో దుమారం రేపింది. ఢిల్లీ పెద్దకు వినపడేలా చేసిన ఈ ‘సీఎం’ ప్రకటన ముందు ముందు కాంగ్రెస్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి.