Begin typing your search above and press return to search.

ఓటు నాది - గెలుపు వైసీపీది

By:  Tupaki Desk   |   12 April 2019 3:46 PM GMT
ఓటు నాది - గెలుపు వైసీపీది
X
ఎన్నికలు ముగిసినా కేఏ పాల్ హడావుడి - కామెడీ మాత్రం తగ్గలేదు. ఇంతకాలం ఏపీలో గెలిచేది మా పార్టీనే ... ఏడాదిలో ఏపీని అమెరికా చేసి తీరుతాను అంటూ అరచేతిలో స్వర్గం చూపించడానికి ట్రై చేసి కామెడీ పాలయిన కేఏ పాల్ నామినేషన్ల తర్వాత నరసాపురం కేంద్రంగా తన రాజకీయం పండించాడు. ఎన్నికల ముందు గెలిచేది తానే అని చెప్పిన పాల్... ఇపుడు తాజాగా చంద్రబాబు మాటను మక్కీకి మక్కీ కాపీ కొట్టేస్తున్నారు.

నరసాపురం లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయని అన్నారు. అయితే... గెలిచేది మాత్రం నేను కాదన్నారు. ఇదేం ట్విస్టండీ అండీ... అదంతే అంతా ఈవీఎం మహిమ అంటున్నారు. ఈవీఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ చెప్పారు. ఎన్నికల కమీషన్ మొత్తం ప్రధాని మోడీ కంట్రోల్లో ఉందని... తనకు నచ్చిన వారిని గెలిపించుకుంటారని పాల్ ఆరోపణలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో నరసాపురంలో ప్రజా మద్దతు నాకే గాని విజయం మాత్రం వైసీపీదే అంటూ అచ్చం టీడీపీ లాగే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ - పాల్ ఇద్దరూ టీడీపీ వ్యూహంలో భాగనే అన్న ఆరోపణలు నిజమని రోజురోజుకి అర్థమవుతోంది.

ఇక ఎన్నికల ముగిశాయి... పాల్ కొత్త యుద్ధం మొదలుపెట్టారట. దేనిపైనో తెలుసా... అవినీతిపైన. నాతో యువత కలిసి ఉద్యమించడానికి రెడీ అయితే అవినీతి పై యుద్దం చేసి దానిని నిర్మూలిస్తానని అన్నారు. ఎర్రటి ఎండలకు పొలిటికల్ హీట్ కూడా కలిసి రాష్ట్రంలో రచ్చరచ్చ అవుతున్న నేపథ్యంలో తన మాటలతో కేఏపాల్ రాజకీయ వాతావరణాన్ని కూల్ చేశారు. రకరకాల హావభావాలు - డ్యాన్సులు - ఫ్లైయింగ్ కిస్సులతో రెచ్చిపోయారు.