Begin typing your search above and press return to search.

ఐటీ దాడుల్లో అనుకోని ఆధారం దొరికింద‌ట‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 8:17 AM GMT
ఐటీ దాడుల్లో అనుకోని ఆధారం దొరికింద‌ట‌!
X
ఇటీవ‌ల త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ ఆమె సంబంధీకులే ల‌క్ష్యంగా జ‌రిగిన ఆదాయప‌న్నుశాఖ దాడుల్లో ఊహించ‌ని విధంగా మ‌న్నార్‌గుడి మాఫియాకి సంబంధించిన ఆస్తులు వెలుగుచూడ‌టం అంద‌రికీ తెలిసిందే. అయితే ఎవ‌రూ ఊహించ‌ని కొన్ని ఆధారాలు కూడా ఐటీ దాడుల్లో ల‌భ్య‌మైన‌ట్లు స‌మాచారం. ఈ ఆధారాలు ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానాలు దొర‌క‌ని ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబిస్తాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇంత‌కీ ఐటీ అధికారుల‌కు దొరికిన ఆ ఆధారాలు ఏమిటి? ఎవ‌రికి సంబంధించిన‌వి ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌లేంటి? అనే అనుమానాలు త‌లెత్త‌డం స‌హ‌జం.

చిన్న‌మ్మను టార్గెట్ చేసి ఐటీ అధికారులు జ‌రిపిన దాడుల్లో అనూహ్యంగా తమిళనాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, అమ్మ జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన ఆధారాలు దొరికాయ‌ట‌. ఊహ‌కంద‌ని మ‌లుపులు మ‌ధ్య సుదీర్ఘ‌కాలం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన జయలలిత మరణంపై ఇప్పటికీ అనుమానాలు ముసురుతూనే ఉన్నాయి. ఆఖ‌రి రోజుల్లో అమ్మ పరిస్థితి ఏమిట‌నేది బాహ్య ప్ర‌పంచానికి ఈ రోజుకీ తెలియ‌దు. ఆమె గురించి శశికళకు తప్ప మరోవ్య‌క్తికి తెలియ‌లేదు. అంతేకాదు జయలలిత వ్య‌క్తిగ‌త‌ జీవితంలోనూ ఎవరికీ తెలియని మ‌లుపులు చాలానే ఉన్నాయంటారు. ఇప్పటికీ అవి ర‌హ‌స్యాలుగానే మిగిలిపోయాయి. కనీసం ఆమె ఆస్ప‌త్రిపాలైన‌ప్పుడూ ఎలా ఉన్నారన్న దానికి ఫోటోలు గానీ వీడియోలు గానీ విడుద‌ల‌ రాలేదు. అయితే పోయెస్ గార్డెన్‌లోని జ‌య నివాసం వేద నిలయంలో తాజా ఐటీ దాడుల్లో అమ్మ‌ చివరి రోజుల్లోని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నపెన్ డ్రైవ్ ఒకటి దొరికందని ప్ర‌చారం సాగుతోంది.

వేదనిలయంలో జయలలిత వ్యక్తిగత సహాయకుడు పూంగుండ్రన్, నెచ్చెలి శశికళ గదుల్లో ఐటీ అధికారులు త‌నిఖీలు జ‌రిపారు. ఈ సోదాల్లో అధికారులకు ఒక పెన్‌డ్రైవ్ లభ్యమైనట్టు స‌మాచారం. ఆ పెన్‌డ్రైవ్‌లో జయను ఆస్పత్రికి తరలించే గంటముందు నమోదైన సీసీటీవీ దృశ్యాలు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రికి తరలించే సమయానికే జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లారన్న ప్రచారానికి పెన్ డ్రైవ్ లోని దృశ్యాలు బలాన్ని చేకూరుస్తున్నాయ‌ట‌. ఆ వీడియో క్లిప్పింగ్స్ లో జయలలిత అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు.. జయ మృతిపై నిజ‌నిర్థార‌ణ‌కు ఏర్పాటైన‌ జస్టిస్‌ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ గ‌డువు బుధవారంతో ముగియనుంది. ఈ నేప‌థ్యంలో ఈ పెన్‌డ్రైవ్ వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది.

అంతేకాకుండా అపోలో ఆసుపత్రిలో జయకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలందించిన లండన్‌ డాక్టర్‌ బీలే సహా అపోలో ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్లకు సమన్లు జారీ చేయాలని క‌మిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల వద్ద ఉన్న పెన్‌ డ్రైవ్ పైనే ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది. ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?.. అన్న సందేహానికి అందులో సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. పెన్‌డ్రైవ్ లో మరేదైనా కీలక సమాచారం బయటపడుతుందా? అన్న ఉత్కంఠ కూడా అంద‌రిలోనూ మొదలైంది. జయలలిత మృతిపై విచారణలో భాగంగా అవసరమైతే ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి - డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మరికొంతమంది మంత్రులను విచారించాలని కమిటీ భావిస్తున్నట్టు ప్ర‌చారం సాగుతోంది.