Begin typing your search above and press return to search.

డోక్లాంలో చైనా సైన్యం మ‌ళ్లీ కెలికింది

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:53 AM GMT
డోక్లాంలో చైనా సైన్యం మ‌ళ్లీ కెలికింది
X
భారత్‌ - చైనా మధ్య డోక్లాం వివాదం మళ్లీ రాజుకునేలా కనిపిస్తోంది. భారత్‌ - భూటాన్‌ - చైనా సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో చైనా భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి. సిక్కిం-భూటాన్‌-టిబెట్‌ జంక్షన్‌ లో చైనాకు చెందిన 1,800 మంది సైన్యం మోహరించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతంలో చైనా రెండు హెలిపాడ్లను నిర్మించి - కొన్ని రోడ్లను ఆధునీకరించింది. అలాగే సైన్యం కోసం కొన్ని నివాసాలను కూడా ఏర్పాటుచేసింది. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్‌ వ్యూహాత్మకంగా అడ్డుకున్నప్పటికీ ఈసారి ఆ దేశం తమ సైన్యం కోసం శాశ్వత ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంతకుమునుపు చైనా సైన్యం ఏడాదికొకసారి తమ ఉనికిని చాటుకొనేందుకు ఆ ప్రాంతానికి వచ్చేది. శీతాకాలం ప్రారంభం కాగానే భారత్‌ - చైనాలు తమ దళాలను అక్కడి నుంచి ఉపసంహరించుకొనేవి. డోక్లాం తమ భూభాగంలోనిదేనని తెలిపేందుకు ఈ శీతాకాలంలో అక్కడ సైన్యాన్ని మోహరిస్తామని చైనా ఇదివరకే తెలిపింది. దీంతో భారత్‌ కూడా సైనిక దళాలను డోక్లాంలో మోహరిస్తోంది. ఇదిలాఉండ‌గా...డోక్లాం ప్రాంతంలో భారత దళాలు తమ భూభాగంలోకి రాకుండా ఎంతో సంయమనంతో నిరోధించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. భారత్‌ తో సంబంధాలకు తాము ఇచ్చే విలువను - ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో నిగ్రహంతో వ్యవహరించామని చెప్పారు.

వాంగ్‌ వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ సోమవారం తమ వెబ్‌ సైట్‌ లో విడుదల చేసింది. చైనా పొరుగుదేశాలతో సంబంధాలకు, భారత్‌ తో స్నేహానికి ఎప్పుడూ విలువనిస్తుందని వాంగ్‌ పేర్కొన్నారు. తమ రెండు దేశాలు ఇరుగుపొరుగువే కాకుండా - అతిపురాతన సంస్కృతి గలవని ఆయన గుర్తు చేశారు. డోక్లాం ప్రతిష్టంభనను దౌత్యపరంగానే పరిష్కరించుకున్నామని తెలిపారు.