Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల‌కు హ‌రీశ్ గుడ్‌ బై.. కార‌ణం అదేనా?

By:  Tupaki Desk   |   21 Sep 2018 6:03 PM GMT
రాజ‌కీయాల‌కు హ‌రీశ్ గుడ్‌ బై.. కార‌ణం అదేనా?
X
తెలంగాణ‌లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ పార్టీలో కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ రాజ‌కీయ వార‌స‌త్వం విష‌యంలో ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ - మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావు మ‌ధ్య‌లో నెల‌కొన్న అప్ర‌క‌టిత పోరులో కేటీఆర్ పై చేయి సాధించార‌నే సంగ‌తి తెలిసిందే. అయితే హ‌రీశ్ రావును మ‌రింత అణ‌గ‌దొక్కాల‌ని చూస్తున్నార‌ని అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన సూచ‌న‌ల‌తో విరక్తి చెందిన హ‌రీశ్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటాన‌నే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు చెప్తున్నారు.

సంచ‌ల‌న‌మైన ఈ ఎపిసోడ్ వివ‌రాల్లోకి వెళితే...ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగానే మ‌రోమారు త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు. ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నప్పుడే.. రాజకీయాల నుంచి హూందాగా తప్పుకోవడం మంచిదనిపిస్తోందన్నారు. త‌న‌ను గెలిపించిన సిద్ధిపేట‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని - ఇంకెంతో చేయాల‌ని ఉంద‌ని...అయితే ఇదే రాజ‌కీయాల‌కు దూరం కావ‌డం స‌రైన స‌మ‌యమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప‌దవి లేకపోయినా ప్రజలతోనే ఉండిపోవాలనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

అయితే, తెలంగాణలోని మాస్ లీడ‌ర్ల‌లో ఒక‌రైన హ‌రీశ్‌ కు పార్టీల‌కు అతీతంగా స‌న్నిహితులు ఉన్నారు. ఆయ‌న శైలిని అభిమానించే వారున్నారనేది రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌. అలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల నుంచి వైదొల‌గాల‌నే మాట అన‌డం వెనుక ఇటీవ‌ల పార్టీలో చోటుచేసుకున్న ప‌రిణామాలు కార‌ణం అంటున్నారు. హ‌రీశ్‌ రావు అసంతృప్తి ప్ర‌క‌ట‌న ఎక్క‌డికి దారితీస్తుందోన‌నే సందేహం స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది.