Begin typing your search above and press return to search.

ట్రంప్‌కు చుక్క‌లు క‌నిపించే టేప్ బ‌య‌ట‌కొచ్చింది

By:  Tupaki Desk   |   24 May 2017 8:11 AM GMT
ట్రంప్‌కు చుక్క‌లు క‌నిపించే టేప్ బ‌య‌ట‌కొచ్చింది
X
దేశాధ్య‌క్ష స్థానంలో ఉన్న వ్య‌క్తి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏ మాత్రం నోరు జారినా దాని ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. త‌న వైపు చూస్తున్నార‌న్న సందేహం వ‌చ్చినంత‌నే చంపేసే క్రూరుడిగా.. ప‌ర‌మ దారుణ నియంత‌గా ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు పేరుంది. అత‌గాడి నిర్ణ‌యం ఎప్పుడు ఎలా ఉంటుంద‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కాదు. అలాంటి కిమ్ మీద దేశాధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

ఇటీవ‌ల ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రొడ్రిగో డ్యుటెర్టెతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట జారేశారు. కిమ్ వైఖ‌రి స‌రిగా లేన‌ప్ప‌టికీ.. అమెరికా అధ్య‌క్షుడి హోదాలో ఆచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయి.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం.. దానికి సంబంధించిన ఆడియో టేపుల్ని తాజాగా వాషింగ్ట‌న్ పోస్ట్ మీడియా సంస్థ విడుద‌ల చేయ‌టం ఇప్పుడో కొత్త క‌ల‌క‌లానికి తెర తీసింది.

ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడితో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ స‌మ‌యంలో.. కిమ్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడిన మాట‌లు చూస్తే.. అణుబాంబులు ప‌ట్టుకున్న ఆ పిచ్చోడిని చూస్తూ ఊరుకోలేం. ఆయ‌న‌కంటే మా ద‌గ్గ‌ర 20 రెట్లు ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. అయితే.. మేం వాటిని వాడాల‌ని అనుకోవ‌టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించిన ఆడియో క్లిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అంతేనా.. కిమ్ గురించి మీరేం అనుకుంటున్నార‌ని ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడిని ట్రంప్ అడ‌గ్గా.. కిమ్ మ‌తిస్థిమితం స‌రిగా లేద‌ని.. ఆయ‌న ఎప్పుడేం చేస్తారో? అంటూ ఆయన వ్యాఖ్యానించిన వైనాన్ని స‌ద‌రు మీడియా క‌థ‌నంలో పేర్కొన్నారు. ఉత్త‌ర‌కొరియా అణుదాడిని ఎదుర్కోవాలంటే చైనా మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని.. ఆ విష‌యంపై చైనా అధ్య‌క్షుడితో మాట్లాడాల‌ని ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడ్ని ట్రంప్ కోర‌టం తాజాగా విడుద‌లైన ఆడియో టేపులో ఉంది. త‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడి రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.