Begin typing your search above and press return to search.

కోర్టుల‌పై కామెంట్లు..సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కీల‌క వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   18 Feb 2019 9:57 AM GMT
కోర్టుల‌పై కామెంట్లు..సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కీల‌క వ్యాఖ్య‌లు
X
దేశ‌స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజన్ గొగొయ్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలకమైన అంశాలపై గొగొయ్ స్పందించారు. సాధారణంగా న్యాయమూర్తులు చాలా సీరియస్‌గా ఉంటారని - అసలు నవ్వరని పేరుంది. ఇదే ప్రశ్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్‌ ను ప్రశ్నిస్తే ఆయనిలా సమాధానమిచ్చారు. మీరు ముక్కోపి అనే అంటారు కదా అని అడిగితే..``నేను ఎవరినీ సంతోష పెట్టడానికి అక్కడ లేను. నేను దౌత్యవేత్తనో - రాజకీయ నాయకుడినో కాదు ఎప్పుడూ నవ్వతూ పక్కవాళ్లను సంతోషపెట్టడానికి. నాకు ఏది సరైంది అనిపిస్తే అది చేస్తాను. నేను తప్పు కూడా కావచ్చు. ఎవరైనా చెత్త వాగుడు వాగితే నేనేం చేయాలి?`` అని ప్రశ్నించారు.

న్యాయమూర్తులకు లేని ఉద్దేశాలను ఆపాదించడంపై గొగొయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల న్యాయ వ్యవస్థపై యువతలో ఓ దురభిప్రాయం ఏర్పడిందని - అందువల్ల వాళ్లు న్యాయమూర్తులు కావాలని అనుకోవడం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ``తీర్పులను తప్పుపట్టండి - చట్టంలోని లోపాలను లేవనెత్తండి. అంతేకానీ తీర్పు చెప్పిన న్యాయమూర్తులపై దాడులు - వాళ్లకు లేని ఉద్దేశాలు అంటగట్టడం సరికాదు. జడ్జీలపై బురద జల్లడం చాలా ప్రమాదకరమైన పరిణామం`` అని రంజన్ గొగొయ్ అన్నారు. ``మేము బాగానే సంపాదిస్తున్నాం కదా.. ఇక న్యాయమూర్తులు కావడం ఎందుకు - బురద జల్లించుకోవడం ఎందుకు అని యువత అనుకుంటున్నది. ఇది మా కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. అందువల్ల సత్తా ఉన్న వాళ్లు జడ్జీలు కాకుండా మిగిలిపోతున్నారు`` అని గొగొయ్ చెప్పారు. న్యాయమూర్తుల నియామకానికి ప్రభుత్వం అడ్డుపడుతున్నదన్న వాదనను కూడా ఆయన కొట్టి పారేశారు. ప్రభుత్వం చాలా వేగంగా నియామకాలు చేస్తున్నదని, పెండింగ్‌లో పెట్టడం లేదన్నారు. కేవలం 30 కేసులు మాత్రమే ప్రభుత్వం దగ్గర పెండింగ్‌ లో ఉన్నాయని తెలిపారు.