మోదీకి బాబు అల్టిమేటం - 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాలట!

Mon Feb 11 2019 12:00:49 GMT+0530 (IST)

కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నిరసనకు తాజాగా దిల్లీ వేదికగా మారింది. రాష్ట్ర విభజన హామీల అమలును డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని ఏపీ భవన్ లో ఆయన సోమవారం ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని కేంద్రం మోసం చేసిందంటూ దుయ్యబట్టారు.ధర్మ పోరాట దీక్షలో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు మూడు రోజుల్లోగా ఏపీ ప్రజలకు పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పాలంటూ ప్రధాని మోదీకి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ను క్షమించబోరని పేర్కొన్నారు. మోదీని బీజేపీని శాశ్వతంగా బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఏపీకి జరిగిన అన్యాయంపైనే తాము పోరాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. కేంద్రం వేసే భిక్ష కోసం కాదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాటం చేయక తప్పదని వెల్లడించారు. పాలకులు ధర్మాన్ని పాటించనప్పుడు వారికి ఎదురుతిరగాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో బీజేపీ నేతలే డిమాండ్ చేసిన సంగతిని చంద్రబాబు గుర్తుచేశారు. పదేళ్లు ప్రత్యేక ప్రకటించాలని అప్పటి పార్టీ సీనియర్ నేత - ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కూడా అడిగారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఏ ఒక్క హామీని కూడా ఎన్డీయే నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.

ఏపీలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా జరగకుండా కేంద్రం మోకాలడ్డుతోందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను ఆమోదించలేదని తెలిపారు. విశాఖ రైల్వేజోన్ కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటు తీర్చలేదని రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే తాను దిల్లీలో దీక్షకు కూర్చున్నానని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఆటలు సాగవని చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం.. భావితరాల భవిష్యత్తు కోసం.. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని ఉద్ఘాటించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఆంధ్రా భవన్ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశామని.. అవన్నీ కూడా విజయవంతమయ్యాయని గుర్తుచేశారు.