Begin typing your search above and press return to search.

భద్రాద్రి రాముడి అనుగ్ర‌హం ఎవ‌రికో?

By:  Tupaki Desk   |   8 Nov 2018 4:32 PM GMT
భద్రాద్రి రాముడి అనుగ్ర‌హం ఎవ‌రికో?
X
ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రంగా భ‌ద్రాచ‌లం ఖ్యాతిగాంచింది. దక్షిణ అయోధ్యగా పేరున్న భ‌ద్రాచలం...విభ‌జ‌నానంత‌రం తెలంగాణ‌లోకి వెళ్లింది. రాజకీయప‌రంగానూ భ‌ద్రాచ‌లానికి విశిష్ట గుర్తింపు ఉంది. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇక్క‌డి ఓట‌ర్ల తీర్పుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. విభ‌జ‌న త‌ర్వాత భ‌ద్రాచ‌లం నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. చింతూరు - వీఆర్‌.పురం - కూనవరం మండలాలను ఏపీలో కలిపారు. వెంకటాపురం - వాజేడు మండలాలు భూపాలపల్లిలోకి వెళ్లాయి. భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలోని దుమ్ముగూడెంకు స‌మీపంలో ఛతీస్‌ గఢ్‌ రాష్ట్ర సరిహద్దు ఉండ‌డంతో ఇక్క‌డ‌ మావోయిస్టుల పాబల్యం ఎక్కువ.

భ‌ద్రాచ‌లంలో 14సార్లు ఎన్నికలు జరిగాయి. సీపీఐ రెండుసార్లు - 4సార్లు కాంగ్రెస్‌ - 8సార్లు సీపీఎం అభ్యర్థులు విజ‌యం సాధించారు. 1955లో తొలిసారిగా జ‌రిగిన ఎన్నికల్లో సీపీఐకి చెందిన శ్యామల సీతారామయ్య గెలిచారు. భద్రాచలం టౌన్‌(భద్రాచలం రెవెన్యూ గ్రామం ఒక్కటే) - దుమ్ముగూడెం - చర్ల - వెంకటాపురం - వాజేడు మండలాలు ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్నాయి. 1,33,764 మంది ఓటర్లు ఉన్నారు. సీపీఎం కంచుకోటగా ఉన్న భ‌ద్రాచ‌లంలో ఆ పార్టీ 8సార్లు గెలిచింది. ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు - కుంజాబొజ్జి మూడుసార్లు వరుసగా విజయం సాధించారు. కుంజా బొజ్జి సాధార‌ణ జీవితం...ఈ త‌రం వారికీ ప‌రిచ‌య‌మే. ఆదర్శనేత‌ల‌గా ఆయ‌న‌ నిలిచిన వైనం పై సోషల్ మీడియాలో వైర‌ల్ పోస్టులు స‌ర్క్యులేట్ అవుతుంటాయి. తాజా మాజీ ఎమ్యెల్యే సున్నం రాజయ్య కూడా ఇక్క‌డ నుంచి మూడుసార్లు గెలిచారు. ఈ సారి రాజయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి పోటీ చేయనున్నారు.