Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో అమెరిక‌న్ జేమ్స్ బాండ్స్‌

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:32 AM GMT
హైద‌రాబాద్ లో అమెరిక‌న్ జేమ్స్ బాండ్స్‌
X
జేమ్స్ బాండ్ అన్న వెంట‌నే వెండి తెర మీద సాహ‌సోపేత‌మైన చేష్ట‌ల‌తో చెల‌రేగిపోయే పాత్ర గుర్తుకు వ‌స్తుంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా.. త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని ఎలాంటి తేడా లేకుండా పూర్తి చేసే ఈ పాత్ర‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రీల్ హీరో ముచ్చ‌ట‌ను కాస్త ప‌క్క‌న పెడితే.. రియ‌ల్ హీరోస్ ఇప్పుడు హైద‌రాబాద్‌ కు వ‌చ్చేశారు. గుట్టుగా హైద‌రాబాద్ లోని వివ‌రాల్ని వారు సేక‌రిస్తున్నారు.

త‌మ అధ్యక్షుల వారీ గారాల‌ప‌ట్టి ఇవాంకా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇక్క‌డి ప‌రిస్థితుల్ని.. ప‌రిణామాల్ని మ‌దింపు చేస్తున్నారు. ఇక్క‌డ ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌పై వారు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ నెల 28న హైద‌రాబాద్ లో నిర్వ‌హించే అంత‌ర్జాతీయ బిజినెస్ స‌మ్మిట్ కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వారి కుమార్తె ఇవాంకా హాజ‌రు కానున్నారు.

అమెరికా అధ్య‌క్షుల వారికి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించే ఇవాంకా భ‌ద్ర‌త కోసం అమెరిక‌న్ జేమ్స్ బాండ్స్ నెల క్రిత‌మే న‌గ‌రానికి చేరుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న వారు త‌మ‌దైన నిఘాను పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఇవాంకా హైద‌రాబాద్ టూర్ సంద‌ర్భంగా ఆమె ప‌ర్య‌టించే ప్రాంతాల్ని ముంద‌స్తుగా అమెరికా సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు చెక్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఇవాంకా హైద‌రాబాద్ చేరుకున్న త‌ర్వాత అస‌లు ఆమేం చేయ‌నున్నారు? ఎవ‌రెవ‌రిని క‌ల‌వ‌నున్నారు? వారి నేప‌థ్యం ఏమిటి? వారికి ఉండే భ‌ద్ర‌త‌.. వారి సామాజిక స్థాయి లాంటి అంశాల్ని కూడా సేక‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. రోడ్ మ్యాప్‌.. ఇక్క‌డ ప‌రిస్థితులు.. భౌగోళిక‌ప‌ర‌మైన అంశాలు.. ఇవాంకా పర్య‌ట‌న రోడ్ మ్యాప్ త‌దిత‌ర అంశాలపై కూడా వారు దృష్టి సారించారు.

ఇవాంకా ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉండ‌నున్నారు. ఆమె భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల్ని స‌మీక్షించేందుకు దాదాపు నెల కంటే ముందుగా హైద‌రాబాద్ చేరుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే వారు త‌మ ప‌నిని మొద‌లు పెట్టార‌ని మ‌న ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇవాంకా పాల్గొనే కార్య‌క్ర‌మాల్లో వేదిక మీద ఉండే వారు ఎవ‌రు? వారి బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. ఆమె ప‌ర్య‌టిస్తార‌ని చెబుతున్న చార్మినార్‌.. ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ ప్రాంతాల్లోని నిర్వాహ‌కుల వివ‌రాల్ని సేక‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇవాంకా ప‌లు చోట్ల ప‌ర్య‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ జేమ్స్ బాండ్స్ తుది నివేదిక ఆధారంగానే ఆమె షెడ్యూల్‌ను ఫిక్స్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక‌.. ఇవాంకా భ‌ద్ర‌త కోసం ఒక మ‌హిళా ఐపీఎస్ అధికారిని నియ‌మించాల‌ని భావిస్తున్నారు.