కృష్ణా నీటిలో 'గరుడ'!... పీకేపై నిప్పులు!

Sun Feb 10 2019 21:49:13 GMT+0530 (IST)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ టూర్ నేపథ్యంలో చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయిన *గరుడ పురాణం* శివాజీ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆదిలోనే ఉద్యమాలు మొదలెట్టిన సినీ నటుడు శివాజీ.... టీడీపీపైనా విమర్శలు గుప్పించారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీతో పాటు టీడీపీ కూడా కారణమేనని కూడా శివాజీ వాదించారు. టీడీపీ వైఖరికి నిరసనగా ఏకంగా విజయవాడ కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేపట్టాడు. ఆ దీక్షను భగ్నం చేసిన టీడీపీ సర్కారు... ఆయనను ఎత్తి ఆసుపత్రిలో వేయించేసింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ... చాన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన శివాజీ... బీజేపీతో టీడీపీ బంధం తెంచుకోగానే... టీడీపీకి అండగా మరో కొత్త అవతారం ఎత్తాడు. గరుడ పురాణం పేరిట ఓ కొత్త పురాణం వినిపించారు.ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తుండటం - ఆ తర్వాత గాయబ్ అయిపోతున్న శివాజీ... తాజాగా మోదీ ఏపీ టూర్ సందర్భంగా మరోమారు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి నేల మీద కాద కాకుండా నీటిలో  ప్రత్యక్షమైపోయాడు. మోదీ ఏపీ టూర్ ను నిరసిస్తూ... విజయవాడ పరిధిలో కృష్ణా నదిలో నల్ల రంగు షర్ట్ వేసుకుని దిగిన శివాజీ... మోదీ ఏపీ నుంచి వెళ్లిపోయిన తర్వాతే నీటి నుంచి బయటకు వస్తానని ప్రకటించారు. మోదీ వచ్చి వెళ్లిన తర్వాత కొంతసేపు నీటిలోనే మీడియాతో మాట్లాడి తనదైన షోను పండిచేసిన శివాజీ... మోదీపై నిందలు వేసే దాని కంటే కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు.

నాడు బీజేపీ ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించిన జనసేనాని ఇప్పుడెక్కడున్నారంటూ శివాజీ తనదైన శైలి కామెంట్లు సంధించాడు. నాడు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు తలూపిన వైనాన్ని కామెడీ చేసిన పవన్... ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఇప్పుడు రాష్ట్రానికి వస్తే పవన్ నోరెందుకు పెగలడం లేదని కూడా శివాజీ ప్రశ్నించాడు. ఇక పనిలో పనిగా చంద్రబాబు ఢిల్లీ ధర్మపోరాట దీక్షపైనా స్పందించిన శివాజీ... ఆ దీక్షకు జనం మద్దతు పలకాలని పిలుపునిచ్చాడు.