Begin typing your search above and press return to search.

అధినేతల రెస్ట్.. ఎవరు ఎక్కడికి?

By:  Tupaki Desk   |   17 April 2019 10:01 AM GMT
అధినేతల రెస్ట్.. ఎవరు ఎక్కడికి?
X
దాదాపు ఆర్నెళ్ల పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ లోని పార్టీ అధినేతలు రాష్ట్రం విడిచి వెళ్లనున్నారు. అభ్యర్థుల ప్రకటన నుంచి పోలింగ్‌ వరకు ఎంతో బిజీగా గడిపిన టీడీపీ, వైసీపీ అధినేతలు కొన్ని రోజులు రాష్ట్ర మీడియాకు దూరం కానున్నారు. పోలింగ్‌ తరువాత గెలుపోటములు లెక్కేసిన వీరు ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఈ గ్యాప్‌ ను సద్వినియోగం చేసుకోనున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు మద్దతునిచ్చిన పార్టీల తరుపున ప్రచారం చేయడానికి వెళ్తుండగా.. వైసీపీ అధినేత మాత్రం హాలీడే ట్రిప్‌ వేయనున్నారు.

దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్‌ లో పోలింగ్‌ నిర్వహించారు. దీంతో సమయం ఎక్కువగా లేకపోవడంతో ఉన్నంతలోనే రాష్ట్రం మొత్తం పార్టీల అధినేతలు ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధినేత ఒక్క రోజులోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఆ తరువాత విశ్రాంతి తీసుకోకుండా ప్రచారాన్ని నిర్వహించారు.

రోజుకు ఐదారు సభల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నవ్యాంధ్రప్రదేశ్‌ లో ఒక్కసారి అవకాశం ఇస్తే తానేంటో చూపిస్తానని ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు బిజీబిజీగా గడిపిన జగన్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి హాలీడే ట్రిప్‌ వేయనున్నారు. ఈ నెలరోజులు ఆయన విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే గెలుపు ఊపులో ఉన్న ఆయన ఆ తరువాత తమదే ప్రభుత్వం అంటూ ధీమాతో ఉన్నారు.

మరోవైపు చంద్రబాబు సైతం ఇక రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలో పర్యటించనున్నారు. ఇప్పటివరకు ఆయనకు మద్దతచ్చిన తృణముల్‌- జేడీఎస్‌- డీఎంకే- ఆప్‌ పార్టీల తరుపున ప్రచారం చేయనున్నారు. ఇప్పటి వరక కర్ణాటక సభలో ప్రసంగించిన ఆయన బెంగాల్‌, ఢిల్లీలో కూడా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం.

ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకునేలా ఇప్పటికే కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో స్నేహం చేస్తున్నారు. అయితే జగన్‌ మాత్రం జాతీయ పార్టీల గురించి పట్టించుకోవడం లేదు. ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మద్దతిస్తానని ఇప్పటికే ప్రకటించిన జగన్‌ ఆయన ఎవరి తరుపున ప్రచారం చేయడం లేదు.