Begin typing your search above and press return to search.

జగన్ బీసీ గర్జన సూపర్ హిట్!

By:  Tupaki Desk   |   17 Feb 2019 1:45 PM GMT
జగన్ బీసీ గర్జన సూపర్ హిట్!
X
ఏలూరు అంతా బీసీల తో నిండిపోయింది. ఏలూరు అంతా వైయస్సార్సీపి జెండాలతో రెపరెపలాడింది. ఏలూరు అంతా జగన్ జై నినాదాలతో హోరెత్తింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సూపర్ హిట్ అయింది. పది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ గర్జన.. ఏలూరు లో జరిగిన వై ఎస్ ఆర్ సి పి బీసీ గర్జన తో పోలిస్తే వెలవెలపోయింది. స్పష్టమైన హామీలతో.. తాను ఏం చేయదలచుకున్నారో ఆ హామీలను జగన్ ప్రస్తావించడంతో గర్జనకు వచ్చిన బీసీలంతా జగన్ కి జై కొట్టడం కనిపించింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేందుకు వైయస్సార్సీపి ఏర్పాటు చేసిన బీసీ గర్జన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఆశించిన దానికంటే మరింత అద్భుతంగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. తాను చేయదలచుకున్న పనులను కూడా వివరించడం సభకు వచ్చిన వారికి ఊరటనిచ్చింది.

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ప్రతిసారి సభకు వచ్చిన వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చంద్రబాబు నాయుడు తన సభల్లో మాట్లాడుతున్న ప్రతిసారీ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటే.. బీసీ గర్జనలో మాత్రం జగన్ మాట్లాడుతున్నంత సేపు సభకు వచ్చిన వారి నుంచి చప్పట్లు, కేరింతలు,కోలాహలం కనిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడికి బీసీలు కనిపిస్తారని, ఎన్నికల తర్వాత వారిని పట్టించుకోరని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అంశంపై జగన్ మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులు, యువకుల నుంచి అద్భుతమైన ప్రతిస్పందన రావడం ఆ రెండు వర్గాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పట్ల ఎంతటి నమ్మకం ఉందో అర్థమైంది.