నాకు ఓటు వేయనోళ్లకు నవరత్నాలు అందాలి

Mon Jun 24 2019 16:37:22 GMT+0530 (IST)

ఆసక్తికర వ్యాఖ్యను చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలకు భిన్నమైన రీతిలో ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పక్షపాతాన్ని ప్రదర్శించటం.. పార్టీల వారీగా ప్రయోజనాల్ని పంచటం ఎంతోకాలంగా వస్తోంది. అయితే.. ఇలాంటి వాటిని బద్ధలు కొట్టాలన్న దృఢ సంకల్పంతో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.తాజాగా నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో కలెక్టర్లతో మాట్లాడిన జగన్.. ప్రజలకు చేరువ కావటానికి ఏమేం చర్యలు తీసుకోవాలన్న విషయం మీద కొందరు సీనియర్ అధికారులతో తాను చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఎన్నికల్లో తనకు (తమ పార్టీకి) ఓటు వేయనివారికి సైతం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు చేరాలని.. ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీ నెరవేరాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు దొర్లకూడదన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వానికి అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ తీరు తెన్నుల్ని స్పష్టం చేసిన జగన్ గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రస్తావించని అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఏదైనా సమస్యను తీసుకొని కలెక్టర్లను కలవటానికి వచ్చిన వారితో నవ్వు ముఖంతో మాట్లాడాలని.. వారితో స్నేహపూర్వకంగా ఉండాలని కోరారు. తమ బాధను.. కష్టాన్ని తీర్చే ఆలోచనతో ఉన్నట్లుగా వారి ప్రవర్తన ఉండాలన్నారు. ముఖంలో నవ్వు మిస్ కావొద్దని కలెక్టర్లకు చెప్పిన జగన్.. సదస్సు ముగిసి జిల్లాలకు వెళ్లిన తర్వాత పనితీరులో మార్పు రావాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.