Begin typing your search above and press return to search.

గ్రీస్ లో మరీ అంత దారుణ పరిస్థితా?

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:03 AM GMT
గ్రీస్ లో మరీ అంత దారుణ పరిస్థితా?
X
చేతినిండా డబ్బులున్నప్పుడు దాని విలువ పెద్దగా తెలీదంటారు. చేతిలో డబ్బుకు కటకటలాడిపోయే పరిస్థితుల్లో సమాజంలో ఎంతటి దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటాయనటానికి గ్రీస్ తాజా ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన ఈ దేశంలో ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవటం తెలిసిందే. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతున్నట్లుగా తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం తేల్చింది. దీనికి సంబంధించి వివరాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవటం.. ఆదాయ మార్గాలు పెద్దగా లేకపోవటంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న గ్రీస్ లోని పలువురు అమ్మాయిలు బతుకు దెరువు కోసం వ్యభిచారం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదో కోణమైతే.. వ్యభిచారం కారుచౌక అయినట్లుగా తాజాగా జరిపిన అధ్యయనం ఒకటి తేల్చి చెబుతోంది. గ్రీస్ కు చెందిన దాదాపు 17వేల మంది సెక్స్ వర్కర్లతో జరిపిన ఒక సర్వే వివరాలు విస్మయకరంగా మారాయి. గ్రీస్ కు చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ.. గ్రీస్ లో చోటు చేసుకున్న పరిణామాల్ని వివరిస్తూ.. ప్రస్తుతం ఆ దేశంలో పొట్టకూటి కోసం వ్యభిచారం చేసే వారు తమ ధరను భారీగా తగ్గించేశారని చెబుతున్నారు. గతంలో 53 డాలర్లకు దాదాపు అరగంట సేపు ఆ సుఖం అందించే వారు కాస్తా.. ఇప్పుడు కేవలం 2.1 డాలర్ల (మన రూపాయిల్లో కేవలం రూ.130 నుంచి రూ.140 మధ్యన)కే అరగంట సేపు ఆ సుఖాన్ని ఇచ్చేందుకు వెనుకాడటం లేదు.

దీని వెనుక కడుపు తరుక్కుపోయే ఆకలి కేకలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా గ్రీస్ లోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతుననారు. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ ద్వారా అందించే ఆ సుఖం గంటకు 191 డాలర్లు (మన రూపాయిల్లో దాదాపు రూ.11వేల వరకు) ఉంటే.. గ్రీస్ లో మాత్రం దారుణంగా పడిపోయిందని విశ్లేషిస్తున్నారు.

గ్రీస్ లో వ్యభిచారం చట్టబద్ధం. చాలావరకూ వ్యభిచార గృహాలకు లైసెన్స్ లు ఉంటాయి. గ్రీస్ వీధుల్లో దాదాపు 18,500 వ్యభిచారులు తమ కార్యకలపాల్ని నిర్వర్తిస్తుంటారని చెబుతారు. ఇప్పుడా దేశంలోని సామాజిక వేత్తలకు ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. దేశంలోని 17 నుంచి 20 మధ్య వయసున్న పలువురు అమ్మాయిలు వ్యభిచారం వైపు ఆకర్షితులు కావటం ఓ సమస్యగా మారింది. ఆకలి కేకలు.. ఒక దేశంలోని సామాజిక పరిస్థితుల్ని మరీ ఇంత దారుణంగా మార్చేస్తాయా? అన్న ఆవేదన వ్యక్తమవుతోంది.