రజనీ నోట ఊహించని మాటలు వచ్చాయి

Fri May 19 2017 10:42:11 GMT+0530 (IST)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగు రోజులుగా అభిమానులతో దర్బార్ నిర్వహిస్తున్న ఆయన.. ఈ రోజు ఉదయం అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలా అరుదుగా మాత్రమే ప్రస్తావించిన ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించటం గమనార్హం.

కన్నడిగుడైన రజనీకాంత్ తొలుత బస్సు కండక్టర్ గా పని చేసి సినిమాల్లోకి రావటం.. ఆపై సూపర్ స్టార్ గా అవతరించి.. తిరుగులేని రీతిలో దశాబ్దాల తరబడి కొనసాగుతుండటం తెలిసిందే. తమిళుల ఆరాధ్యుడిగా ఉన్నప్పటికీ.. అంతర్రాష్ట్ర వివాదాలు ఏర్పడిన ప్రతిసారీ ఆయన్ను కన్నడిగుడిగా కొందరు ఎత్తిచూపిస్తూ విమర్శలు చేస్తుంటారు.

త్వరలో రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఉందన్న మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ.. తన స్థానికత గురించి.. తన మీద ప్రత్యర్థులు ఎత్తి చూపే లోపాన్ని తనకు తానే ప్రస్తావించి సమాధానం చెప్పటం ఆసక్తికరంగా మారింది. తాను కర్ణాటక నుంచి వచ్చినా తమిళుల అభిమానంతో తాను పూర్తిగా తమిళుడిగా మారిపోయినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్ని.. ఆయన మాటల్లోనే చూస్తే.. "నేను కర్ణాటక నుంచి వచ్చినా మీ అభిమానంతో నన్ను పూర్తిగా తమిళుడిగా చేశారు. నాకు గొప్పగా స్వాగతం పలికారు. నేను కర్ణాటకలో 23 ఏళ్లు జీవించాను. అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నాను. నన్నో నిజమైన తమిళుడిగా మార్చారు. నేను ఇప్పుడు పక్కా తమిళుడిని. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా రజనీ నోట వచ్చిన మాటలు చూస్తే.. తనను తమిళుడ్ని కాదని ఎత్తి చూపే వారికి సమాధానం చెప్పటంతో పాటు.. తన మూలాల్ని ప్రస్తావించొద్దన్న మాట స్పష్టంగా చెప్పినట్లుగా చెప్పాలి. రాజకీయాల మీద కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రజనీ నోట వచ్చిన ఈ మాటలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/