Begin typing your search above and press return to search.

యోగీ ఖాతాలో ఇదో మ‌ర‌క అంటున్నారు

By:  Tupaki Desk   |   14 Sep 2017 7:51 AM GMT
యోగీ ఖాతాలో ఇదో మ‌ర‌క అంటున్నారు
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఉమ్రి గ్రామానికి చెందిన శాంతి దేవికి రూ. 1.55 లక్షల రుణం ఉంది. అయితే ఆమెకు ఎంత రుణ‌మాఫీ అయిందో తెలుసా? కేవలం పది రూపాయల 37 పైసలు. అవును అధికారులు ఇదే మొత్తానికి రుణాన్ని రద్దుచేస్తున్నట్టు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మౌదాహా గ్రామానికి చెందిన మున్ని లాల్‌కు రూ.40 వేల రుణం ఉంటే.. రూ. 215 రద్దు చేస్తున్నట్టు సర్టిఫికెట్‌ చేతిలో పెట్టారు.ఈ ప్ర‌హ‌సనం ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్ అయింది. యూపీ సీఎం యోగీ ఆదిథ్య‌నాథ్ ప‌రువును ప‌లుచ‌న చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు `మాకు ఓట్లేయండి... మీ రుణాలు మాఫీ చేస్తాం...` అంటూ ప్ర‌క‌టించారు. ఎన్నికలు పూర్తయ్యాయి. అధికారంలో వచ్చాక యోగి ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. మరి వచ్చిన చిక్కేంటంటే.. వారికి మాఫీ చేసిన రుణాన్ని చూసి.. రైతులు షాక్‌ కు గురవుతున్నారు. రూ.లక్ష వరకూ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదులు - వందల్లో రద్దు చేస్తున్నట్టు సర్టిఫికెట్లు ఇస్తుంటే అవి చూసి రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏలెక్కన ఈ మాఫీ చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక్కో రైతుకూ ఒక్క రూపాయి నుంచి రూ.500 వరకూ మాఫీ అయ్యింది. `కృషి రిన్‌ మోచన్‌ యోజన (రైతు రుణమాఫీ పథకం)ను యోగి ప్రభుత్వం గత నెలలో ప్రారంభించింది. రూ.లక్ష పరిమితి విధిస్తున్నట్టు తెలిపింది. 87 లక్షల మంది రైతులకు ఈ పథకం లబ్దిచేకూరుతుందని తెలిపింది. ఇందుకు ప్రభుత్వ ఖజానాకు రూ.36వేల కోట్లు ఖర్చుకానున్నట్టు కూడా అట్టహాస ప్రకటన చేసింది. కానీ సీన్ రివ‌ర్స్ అయింది.

కాగా, ఈ రుణమాఫీపై విమర్శలు రావడంతో దీనిపై తాను సమగ్ర పరిశీలన చేస్తానని మంత్రి సర్దిచెప్పుకొచ్చారు. `నిబంధనల ప్రకారం రుణమాఫీ ఇచ్చాం. వత్యాసాలేమైనా ఉంటే.. దానిపై దర్యాప్తు నిర్వహిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం` అని మన్ను కోరి చెప్పారు. కాగా, దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రుణమాఫీ పేరుతో రైతులను అవమానించినట్లేనని, వారిని వంచిస్తున్నారని సమాజ్‌ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరేశ్‌ ఉత్తం విమర్శించారు. ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని మండిప‌డ్డారు.