Begin typing your search above and press return to search.

ఘర్ వాపసీ...లవ్ జిహాదీ...ముఖ్యమంత్రీజీ

By:  Tupaki Desk   |   19 March 2017 6:35 AM GMT
ఘర్ వాపసీ...లవ్ జిహాదీ...ముఖ్యమంత్రీజీ
X
యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పగానే ఆయన పాపులర్ నినాదాలు గుర్తుకొస్తాయి. యోగి నినాదాల్లో అతిముఖ్యమైనది ఘర్‌ వాపసీ. లవ్‌ జీహాద్‌ - ఘర్‌ వాపసీ వంటి నినాదాలు - ఉద్రేకపూరితమైన ప్రసంగాలతో హిందువులను ఆకట్టుకునే ఆదిత్యనాధ్‌ - మైనార్టీ వర్గాలకు మాత్రం మింగడుపడరు.

మతమార్పిడిల నిషేధం అమలు చేసే వరకు పోరాడతానని ఆయన ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ లో 2007లో చెలరేగిన మతఘర్షణలకు యోగి ప్రధాన కారకుడనే ఆరోపణలున్నాయి. ముంబై – గోరఖ్‌ పూర్‌ గోదాన్‌ ఎక్స్‌ ప్రెస్‌ అగ్నిప్రమాదంపై యోగికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు యోగిని అరెస్ట్‌ చేసే వరకు తమ ఆందోళనలను విరమించలేదు. అయితే, ఆయన అరెస్టును హిందు యువ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. రీసెంటుగా యోగి బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ను పాకిస్తాన్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయ్యద్‌ తో పోల్చి కొత్త వివాదం సృష్టించారు.

వివాదాల పుట్ట

* 2005లో ఘర్‌ వాపసీ పేరుతో ఉత్తరప్రదేశ్‌ లోని ఎతాహ్‌ నగరంలో 1,800ల మంది క్రిస్టియన్లను హిందూ మతంలోకి మార్చారు.

* గోరఖ్‌ పూర్‌ లో జరిగిన హిందూ ముస్లిం అల్లర్లో గాయపడిన హిందూ యువకుడిని యోగి ఆదిత్యనాధ్‌ చూసేందుకు వీల్లేదని జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన సంఘటనాస్థలం వద్ద కూర్చొని ధర్నా చేశారు. యోగి చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగంతో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆయన అనుచరులు మసీదు వద్ద ఆందోళనలు చేసి ముస్లింల ఇళ్లను - షాపులను తగుల బెట్టారు. దీంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.

* కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయగా, కోర్టు ఆయనకు పదిహేను రోజులు రిమాండ్‌ విధించింది.

* యోగి ఆదిత్యనాధ్‌ అరెస్ట్‌ కు నిరసనగా ఆందోళనకారులు ముంబై గోరఖ్‌ పూర్‌ గోదాన్‌ ఎక్స్‌ ప్రెస్‌ కు నిప్పంటించారు.

* సూర్యనమస్కారాలు చేయని వారు దేశం విడిచి వెళ్లండి, సూర్యుడికి దండం పెట్టలేని వారు సముద్రంలో దూకి చావండి, లేదా జీవితాంతం చీకటి గదిలో పడి ఏడవండని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

* బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ఖాన్‌ను పాక్‌ ఉగ్రవాది హఫీజ సయీద్‌తో పోల్చారు. షారుఖ్‌ను స్టార్‌ను చేసింది ఇండియానేనని అన్నారు.

* పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి అనంతరం ఆయన సైతాన్‌ అయినా తన వైఖరి మార్చుకుంటుంది కానీ పాక్‌ మాత్రం మారదని అన్నారు.

పార్టీపైనా దండయాత్రే..

యోగి ఆదిత్యనాథ్ సొంత పార్టీ విషయంలోనూ చాలా దూకుడుగా ఉంటారు. గత దశాబ్దకాలంగా ఆయనకు భారతీయ జనతా పార్టీతో సంబంధాలు సక్రమంగా లేవు. ఈశాన్య యూపీలో పవర్‌ సెంటర్‌ గా మారిన ఆయన వైఖరి పార్టీలో అంతర్గతంగా సమస్యలను కొనితెస్తోంది. బీజేపీ లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించిన సమయంలోనే ఆయన మూడు రోజుల విరాట్‌ హిందు మహా సమ్మేళన్‌ను గోరఖ్‌ పూర్‌ లో నిర్వహించారు. యూపీ అసెంబ్లి ఎన్నికల సమయంలో కూడా ఆయన ఈశాన్య యూపీలో వంద సీట్లకు పైగా తన అనుచరులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ హైకమాండ్‌ అంగీకరించక పోవడంతో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. గతంలో ఆయన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్టీ విప్‌ ను ధిక్కరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/