Begin typing your search above and press return to search.

అక్బ‌ర్ అంటూ ఈ కెలుకుడేంది యోగి?

By:  Tupaki Desk   |   15 Jun 2018 7:45 AM GMT
అక్బ‌ర్ అంటూ ఈ కెలుకుడేంది యోగి?
X
ఊరికే ఉంటే ఆయ‌న్ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ అని ఎందుకంటారు? వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో లైమ్ లైట్లోకి వ‌చ్చిన ఆయ‌న‌.. అప్పుడెప్పుడో చ‌చ్చిపోయినోళ్ల‌లో ఎవ‌రు గొప్ప? మ‌రెవ‌రూ తోపు? లాంటి అవ‌స‌రం లేని అంశాల మీద అదే ప‌నిగా వ్యాఖ్య‌లు చేయ‌టం.. భావోద్వేగాల‌కు గురి చేయ‌టం అల‌వాటు.

గొప్ప‌లు కూడు పెట్ట‌కున్నా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌కున్నా.. ఆయ‌న నోటి నుంచి ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు త‌ర‌చూ వ‌స్తుంటాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఆయ‌న‌.. తాజాగా ల‌క్నోలోని ఐఎంఆర్టీలో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన యోగి.. మ‌హారాణా ప్ర‌తాప్ గొప్ప వీరుడు. వేరే మ‌తానికి చెందిన వాడైన విదేశీ అక్బ‌ర్ చ‌క్ర‌వ‌ర్తిత్వాన్ని ఆయ‌న ఒప్పుకోలేదు.. ఆ విష‌యాన్ని నేరుగా అక్బ‌ర్ రాయ‌బారితోనే చెప్ప‌గ‌లిగాడన్నారు.

మ‌హారానా ప్ర‌తాప్ రాజ్యాన్ని కోల్పోయి దేశాలు ప‌ట్టుకు తిరిగినా త‌న ఆత్మ‌గౌర‌వాన్ని మాత్రం వ‌దులుకోలేద‌న్నారు. అందుకే విదేశీయుడైన అక్బ‌ర్‌ను చ‌క్ర‌వ‌ర్తిగా ఒప్పుకోలేద‌న్నాడు. కానీ.. దుర‌దృష్టం కొద్దీ మ‌న చ‌రిత్ర‌కారులు ఇలాంటి అంశాల్ని ప‌ట్టించుకోలేద‌ని.. ఫ‌లితంగా ఒక త‌రం మొత్తం ఇలాంటి గొప్ప వాళ్ల గురించి తెలుసుకునే అవ‌కాశాన్ని కోల్పోయారంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

ముస్లిం పాల‌కుల గురించి యోగి అండ్ కో నోరు పారేసుకోవ‌టం.. త‌మ‌కు తోచిన‌ట్లుగా మాట్లాడ‌టం అల‌వాటే. ఇలాంటి వ్యాఖ్య‌ల కార‌ణంగా లేనిపోని వివాదాల్ని తెర మీద‌కు తీసుకురావ‌టం మిన‌హా మ‌రేమీ ఉండ‌దు. స‌మ‌కాలీన భార‌తంలో జ‌రిగే అంశాల మీద‌నే వేర్వేరు వాద‌న‌లు వినిపిస్తుంటాయి. అలాంటిది వంద‌ల ఏళ్ల క్రితం జ‌రిగిన‌ట్లుగా చెప్పుకునే అంశాల్ని ఆధారంగా చేసుకొని గొప్ప‌ల లెక్క‌లు వేసుకోవ‌టానికి మించిన మూర్ఖ‌త్వం మ‌రొక‌టి ఉండ‌దు.

యోగి చేసిన తాజా వ్యాఖ్య‌ల‌పై స‌మాజ్ వాదీ నేత రాజేంద్ర చౌద‌రి రియాక్ట్ అయ్యారు. 2019 ఎన్నిక‌ల నాటికి స‌మాజాన్ని మ‌తం ప్రాతిప‌దిక‌న చీల్చాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిప‌డ్డారు. బీజేపీని ఎవ‌రూ మార్చ‌లేర‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంద‌రికి మంచి జ‌ర‌గాల‌ని.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను అభివృద్ధి ప‌ట్టాల మీద‌కు ఎక్కించి దూసుకెళ్లేలా చేయాల‌న్న ల‌క్ష్యాన్ని వ‌దిలేసి.. ఏ రాజు గొప్ప‌? ఏ రాజు గురించి ఏ పుస్త‌కంలో ఏం రాశారు? అందులో త‌ప్పులెన్ని లాంటి ప‌నికిమాలిన విష‌యాల మీద దృష్టి పెట్టే క‌న్నా పాల‌న మీద మ‌రింత ఫోక‌స్ పెడితే ప్ర‌జ‌ల త‌ల‌రాత‌లు మార‌తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. అవేమీ యోగి లాంటి పాల‌కుల‌కు గుర్తుకు రాక‌పోవ‌ట‌మే ప్ర‌జ‌లు చేసుకున్న దుర‌దృష్టమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.