Begin typing your search above and press return to search.

త‌న జీవితంలోని చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెట్టిన యోగేంద్ర యాద‌వ్‌

By:  Tupaki Desk   |   19 April 2019 9:09 AM GMT
త‌న జీవితంలోని చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెట్టిన యోగేంద్ర యాద‌వ్‌
X
రీల్ కంటే రియ‌ల్ లైఫ్ మ‌రింత భ‌యంక‌రంగా ఉంటుంది. కొంద‌రి జీవితాల్లో చోటు చేసుకున్న ఉదంతాలు వింటే నోటి వెంట మాట రాదు. తాజాగా అలాంటి ఉదంతాన్ని తొలిసారి బ‌య‌ట‌పెట్టారు సామాజిక కార్య‌క‌ర్త క‌మ్ రాజ‌కీయ నాయ‌కుడు యోగేంద్ర యాద‌వ్‌. త‌న జీవితంలోని చీక‌టి కోణాన్ని ఆయ‌న తొలిసారి రివీల్ చేశారు.

బీజేపీ నేత అమిత్ మాల‌వీయ చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న త‌న లైఫ్ లో జ‌రిగిన ఒక దారుణ నిజాన్ని ప్ర‌పంచం ముందు బ‌య‌ట‌పెట్టారు. ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యంలోకి వెళితే.. మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ బీజేపీ అభ్య‌ర్థిగా భోపాల్ నుంచి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమెకు టికెట్ ఇవ్వ‌టంపైన దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ‌.. ఈ విష‌యంపై ఒక చాన‌ల్ లో డిబేట్ నిర్వ‌హించారు. ఈ డిబేట్ కు బీజేపీ అధికార ప్ర‌తినిధి అమిత్ మాల‌వియా హాజ‌ర‌య్యారు.

చ‌ర్చ‌లో భాగంగా అమిత్ మాట్లాడుతూ.. యోగేంద‌ర్ యాద‌వ్ పేరును ప్ర‌స్తావించారు. ఆయ‌న మ‌త రాజ‌కీయాలు చేస్తార‌ని ఆరోపించారు. దీంతో.. యోగేందర్ త‌న జీవితంలో దాగిన ఒక‌చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. ట్వీట్ ద్వారా ఆయ‌న వెల్ల‌డించిన నిజం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
గాంధీగారి కాలంలో కొంత‌మంది ముస్లింలు త‌మ కుటుంబంపై దాడి చేశార‌ని.. త‌న తండ్రి క‌ళ్ల ఎదుటే ఆయ‌న తండ్రి అంటే త‌న తాత‌ను దారుణంగా చంపేశార‌న్నారు. దీంతో మా నాన్న‌కు గాంధీ మార్గం మీద న‌మ్మ‌కం పోయింది. ఆయ‌న మ‌న‌సు మార్చుకున్నారు. తండ్రి హ‌త్య‌ను క‌ళ్లారా చూసిన ఆయ‌న త‌న పిల్ల‌ల‌కు తన తండ్రిని చంపిన వారి మ‌తం పేర్లు పెట్టిన‌ట్లు చెప్పారు.

ఇలాంటి ఉదంతం మ‌రే దేశంలో జ‌రిగినా.. ఈపాటికి దీని గురించి న‌వ‌ల‌లు.. పుస్త‌కాలు రాసేవార‌ని.. కానీ త‌మ తండ్రి చ‌ర్య‌ల వ‌ల్ల వ‌చ్చిన పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకోవాలని తాము అనుకోవ‌టం లేద‌న్నారు. ఈ క్రెడిట్ త‌న 90 ఏళ్ల తండ్రికే ద‌క్కాల‌న్నారు. త‌న‌ను మ‌త రాజ‌కీయాలు చేస్తార‌ని ఆరోపించిన అమిత్ మాల‌వియాకు యోగేంద్ర ఒక స‌వాల్ విసిరారు. రాజ‌కీయాల్లో ల‌బ్థి పొంద‌టానికి తాను గ‌తంలో ఎప్పుడైనా.. ఎక్క‌డైనా ఈ సంఘ‌ట‌న గురించి ప్ర‌స్తావించిన‌ట్లుగా రుజువు చేస్తే తాను జీవితంలో నోరు విప్ప‌న‌న్నారు. అదే స‌మ‌యంలో తాను విసిరిన స‌వాల్ ను నిరూపించ‌క‌పోతే నోరు మూసుకొని ఉంటారా? అంటూ మండిప‌డ్డారు.