సొంతానికి అద్దెకు తేడా ఇదే చంద్రబాబు?

Sun Jun 09 2019 13:00:01 GMT+0530 (IST)

ఎవరెన్ని చెప్పినా సొంతం సొంతమే. అద్దె.. అద్దె. ఎంత బాగా చూసుకున్నా.. చెప్పినట్లుగా అద్దె కట్టినా.. యజమాని కోరుకున్నంతనే వారి ఆస్తిని వారికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. ఆ చిన్న విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎప్పటికి అర్థమవుతుందో తెలీని పరిస్థితి.తమిళనాడు రాజకీయాలకు తగ్గట్లే ఏపీ రాజకీయాలు తగలడ్డాయి. తమిళనాడులో ప్రతి రాజకీయ పార్టీకి తనదైన మీడియా ఒకటి ఉంటుంది. దాని ద్వారా తమ భావజాలాన్ని చెప్పటమే కాదు.. ప్రత్యర్థులపై విరుచుకుపడటానికి దాన్నో ఆయుధంగా వాడేస్తుంటారు. దివంగత మహానేత వైఎస్ ముందు వరకూ రాజకీయ పార్టీలు సొంతంగా మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసుకున్న దాఖలాలు తెలుగు నేల మీద కనిపించవు. సీపీఎం.. సీపీఐలు దీనికి మినహాయింపు. తోక పార్టీలుగా ఇవి చూపించే ప్రభావం చాలా పరిమితం కావటంతో వాటికి సొంత మీడియా ఉన్నా.. ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.

తెలుగు రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్.. టీడీపీలకు సొంత మీడియా సంస్థలు లేవు. కాకుంటే.. టీడీపీకి పచ్చ మీడియా సపోర్టు ఫుల్ ఉందంటూ విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ సంస్థలతో బాబుకు సన్నిహిత సంబంధాలు తప్పించి.. యాజమాన్యం పరంగా ఎలాంటి హక్కులు లేవు. అంటే.. పచ్చ మీడియా ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయించొచ్చన్న మాట. అలాంటివేళ.. ఎవరో ఒకరి మీద ఆధారపడే కన్నా.. సొంత మీడియా పెట్టుకోవాలని బాబుకు చాలామంది సూచన చేసినా.. ఆయన ఒప్పుకునే వారు కాదు.

తెలుగులో తిరుగులేని పచ్చ మీడియా ఉన్నప్పుడు సొంత మీడియా పెట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న నమ్మకం బాబు సొంతం. మధ్యలో ఆయన కుమారుడు ఒక ఛానల్ పెట్టి నడిపించినా.. అది త్వరగానే మూతపడింది. సొంత మీడియా ఉన్న రాజకీయ అధినేతలు తమ వాదనను నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు. ఎంత మంచిలోనూ ఏదో ఒక లోపాన్ని వెతికి వెతికి మరీ చూపిస్తారు.

ఈ విషయంలో కేసీఆర్.. జగన్ సొంత మీడియాలే పెద్ద ఉదాహరణలుగా చెప్పాలి. చంద్రబాబు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా లేదా? అంటే లేదన్నట్లే ఆయన రాజకీయ ప్రత్యర్థులైన వారి మీడియాలో ప్రముఖంగా రాసేస్తుంటారు. దీన్నెవరు తప్పు పట్టరు. కానీ.. పచ్చ మీడియా ముద్ర ఉన్నప్పటికి.. బాబు ప్రత్యర్థుల మీద రాసిన ప్రతి నెగిటివ్ వార్తను తప్పుపడతారు. ఈ మీడియాను నమ్ముకున్న చంద్రబాబు సొంత మీడియా మీద దృష్టి పెట్టింది లేదు.

అయితే.. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పచ్చ మీడియాగా ముద్రపడిన మీడియా సంస్థలు రాస్తున్న వార్తల్లోనూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నట్లుగా పేర్కొంటున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదే పని బాబుప్రత్యర్థులైన మీడియా సంస్థలు చేస్తాయా? అంటే లేవని చెబుతారు. ఇలాంటప్పుడు సొంత మీడియా ఉంటే బాబు గొంతుకగా మారే అవకాశం ఉంది. కానీ.. బాబు అద్దె మైకులకు ఇప్పుడు జీవన్మరణ సమస్యగా జగన్ మారిన వేళ.. ఆయన ఆగ్రహం తమ మీద పడకూడదన్న భావనలో వ్యవహరిస్తూ ఉండటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదే జరిగితే.. బాబుకు ఇంత కాలం అండగా ఉన్న మీడియా సంస్థలు.. ఇప్పుడు ప్లైట్ ఫిరాయించొచ్చు. అదే జరిగిన బాబుకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. సొంతానికి మించింది మరొకటి లేదనే. మరీ.. వాస్తవాన్ని బాబు ఎప్పటికి గుర్తిస్తారో ఏమో?