సీఎం అయిన గంటలోనే..

Thu May 17 2018 22:08:02 GMT+0530 (IST)

పూర్తి బలం లేకుండానే సీఎం అయ్యారు. ఇంకా విశ్వాస పరీక్షలో గట్టెక్కి సీఎం సీటును సుస్థిరం చేసుకోలేదు. కానీ.. కర్ణాటక కొత్త సీఎం యెడ్యూరప్ప మాత్రం అప్పుడే సీఎంగా తన ప్రయాణానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. అధికార గణంలో తనవారిని తీసుకుంటూ పర అనుకున్న వారికి నిర్దాక్షిణ్యంగా పొగ పెడుతున్నారు. ఎలాగైనా విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తానని నమ్మకమో ఏమో కానీ యెడ్యూరప్ప మాత్రం అధికారం చేపట్టిన గంటలోనే అధికారుల బదిలీలు మొదలు పెట్టారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ అధికారులను మార్చారు.
    
గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారిని కీలక స్థానాల నుంచి తప్పించి తనకు అనుకూలంగా ఉండేవారిని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే..బీదర్ జిల్లా ఎస్పీ దేవరాజ్ ను బెంగళూరు నగర సెంట్రల్ డీసీపీగా బదిలీ చేశారు. అమర్ కుమార్ పాండేని ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా - సందీప్ పాటిల్ ను ఇంటెలిజెన్స్ డీఐజీగా బదిలీ చేశారు. బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీగా ఎస్. గిరీష్ ను బదిలీ చేశారు.
    
మరోవైపు ఆయన సీఎం బాధ్యతలు చేపట్టాక మొట్టమొదట రుణమాఫీపై దృష్టి పెట్టడం చర్చనీయమైంది.  రైతుల రుణమాఫి పై అధికారులతో చర్చించారు. రైతుల రుణమాఫీ విషయం చర్చలు పూర్తి అయిన తరువాత ఐపీఎస్ అధికారుల బదిలీల చేశారు. అనంతరం ఐఏఎస్ లనూ మార్చుతారని.. తన అనుకూలురను ఆయన తెచ్చుకుంటారని అంటున్నారు.