Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రం నుంచే పెద్ద‌ల సభకు వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   24 May 2016 6:03 AM GMT
ఆ రాష్ట్రం నుంచే పెద్ద‌ల సభకు వెంక‌య్య‌
X
బీజేపీ సీనియర్ నేత - కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు మ‌ళ్లీ అవ‌కాశం క‌లిసివ‌చ్చింది. రాజ్యసభ పదవీ కాలం త్వరలోనే ముగియనున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు తిరిగి పొడ‌గింపు ఉంటుందా అనే విష‌యంలో సందిగ్దానికి బీజేపీ కేంద్ర అధిష్టానం ఫుల్‌ స్టాప్ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇప్పటి వరకు కర్నాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్న వెంకయ్యకు ఈ దఫా ఆ రాష్ట్ర కోటా నుంచి టిక్కెట్ లభించే అవకాశాలు ఖ‌రారు అయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న వెంకయ్యను మరోమారు రాజ్యసభకు పంపించాల్సిందేనని పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో కర్నాటక కాకుండా వేరే రాష్ట్రాల వైపు చూసింది. ఈ క్రమంలో ఏపీ సహా మధ్య ప్రదేశ్ - రాజస్థాన్ రాష్ట్రాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వెంకయ్యను మరింత టెన్షన్‌ కు గురి చేసే విషయానికి సంబంధించి వీలయినంత త్వరగా చెక్ పెట్టాలని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం కర్నాటక పార్టీ శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పతో మాట్లాడింది. మరోమారు వెంకయ్యకు కర్నాటక నుంచే అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యమంటూ రంగంలోకి దిగిన యడ్యూరప్ప ఆదివారం బెంగళూరులో బీజేపీ కర్నాటక శాఖ కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంకయ్యను ఈ దఫా కూడా తమ రాష్ట్ర కోటా నుంచే రాజ్యసభకు పంపాలని కోర్ కమిటీ తీర్మానించింది. దీనితో వెంకయ్యకు రాజ్యసభ సభ్యత్వంపై పది రోజులుగా కొన సాగుతున్న సస్పెన్స్‌ కు ఎట్టకేలకు తెర పడింది.