Begin typing your search above and press return to search.

కర్ణాటకలో బలనిరూపణకు బీజేపీ ప్లాన్ ఇదే..

By:  Tupaki Desk   |   17 May 2018 6:55 AM GMT
కర్ణాటకలో బలనిరూపణకు బీజేపీ ప్లాన్ ఇదే..
X
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. మ్యాజిక్ మార్క్ కు 8 సీట్లు తక్కువున్నా కూడా యడ్డీని సీఎం చేసేశారు గవర్నర్. 15 రోజుల గడువు ఇచ్చి బలనిరూపణకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. సీఎం యడ్యూరప్ప చాకచక్యంగా తన కుల సెంటిమెంటును వాడుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.

స్వతహాగా లింగాయత్ కులానికి చెందిన యడ్యూరప్ప - కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు లింగాయత్ సామాజికవర్గ ఎమ్మెల్యేలతో సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా పరిగణించాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఎమ్మెల్యేలు జారీపోకుండా పకడ్బందీ ప్రయత్నాలు చేస్తున్నారు.

అసెంబ్లీ బలనిరూపణకు బీజేపీ అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తోంది. బలనిరూపణ జరిగే రోజున సుమారు 15మంది కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ఉండేందుకు వారిని ప్రలోభ పెడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.. ఎంత ఎక్కువ మంది గైర్హాజరైతే యడ్యూరప్పకు అంత తక్కువ ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. దీంతో ఉన్న 104మందితో గట్టెక్కవచ్చనే ప్లాన్ చేస్తున్నారు.

అంతేకాదు బలనిరూపణ జరిగే లోపు కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన నాలుగు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. గెలిచి వారం తిరిగే సరికే రాజీనామాలకు ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారో లేదోనన్న ఆందోళన నెలకొంది. అయితే భారీగా డబ్బులిచ్చి దీన్ని చివరి అస్త్రంగానే వాడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

మ్యాజిక్ మార్క్ ఎమ్మెల్యేల మద్దతును తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను గైర్హాజర్లతో 208కు తగ్గించాలని ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీలో బలాన్ని తగ్గిస్తే మెజార్టీ కూడా తగ్గుతుందని.. 20మంది సభ్యులు గైర్హాజరైతే 104మందితో ఈజీగా గెలవవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇలా చాలా రకాల ప్లాన్లు వేస్తూ బీజేపీ కన్నడనాట ఎలాగైనా గెలిచి తీరాలని కసిగా ముందుకు వెళుతోంది.