Begin typing your search above and press return to search.

మోడీ పాల‌న ఎమ‌ర్జెన్సీ కంటే దారుణం : కేంద్ర‌మంత్రి తండ్రి

By:  Tupaki Desk   |   24 April 2018 7:03 AM GMT
మోడీ పాల‌న ఎమ‌ర్జెన్సీ కంటే దారుణం : కేంద్ర‌మంత్రి తండ్రి
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై పార్టీ సీనియ‌ర్ నేత మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. కేంద్రమంత్రి జయంత్‌సిన్హా తండ్రి బీజేపీ మాజీ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా బీజేపీ పాల‌న‌పై భ‌గ్గుమ‌న్నారు. ఈ నెల 21న బీజేపీకి సిన్హా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల‌లో దేశంలో ఎమర్జెన్సీకన్నా దారుణ పరిస్థితి నెలకొన్నదని బీజేపీ మాజీ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా అన్నారు. మోడీ ప్రభుత్వ చర్యల వల్ల దేశంలోని ప్రతి ఒక్కరూ అభద్రతాభావంలో ఉన్నారని సిన్హా అన్నారు. ప్రజాస్వామ్య ఆలయాన్ని మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సిన్హా దుయ్య‌బ‌ట్టారు. తాను రాజీనామా చేసిన రోజే తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌సిన్హా పుట్టినరోజు కావడం యాదృచ్చికమని సిన్హా వివరణ ఇచ్చారు.

ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పోవడంపై మోడీ ప్రభుత్వాన్ని సిన్హా తప్పు పట్టారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి 1998లో అవిశ్వాస తీర్మానానికి భయపడకుండా ఎదుర్కొని ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయిన విషయాన్ని సిన్హా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌పై నియంత్రణకు, మీడియా నోరు నొక్కేందుకు మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని సిన్హా విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీలైన సీబీఐ - ఎన్ఐఏ - ఈడీ - ఆదాయం పన్నుశాఖను ఉపయోగిస్తోందని సిన్హా దుయ్యబట్టారు. దేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో(1975-77) కంటే ఇప్పుడు మరింత దారుణ పరిస్థితి ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

రాజీనామా తర్వాత మీ కార్యక్రమం ఏమిటన్న ప్రశ్నకు సిన్హా సమాధానమిస్తూ..ఆందోళనలో ఉన్న రైతులు, అసంఘటితరంగ కార్మికులు - యువకులు - విద్యార్థులు - సమాజంలోని బలహీన వర్గాల కోసం పోరాడుతానని చెప్పారు. అందుకోసం దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్టు సిన్హా తెలిపారు. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని సిన్హా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న తనకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని సిన్హా వెల్లడించారు.