Begin typing your search above and press return to search.

స‌చివాలయం స్పీడు అసెంబ్లీకి లేదా?

By:  Tupaki Desk   |   25 Aug 2016 8:40 AM GMT
స‌చివాలయం స్పీడు అసెంబ్లీకి లేదా?
X
రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత పాల‌న‌ను న‌వ్యాంధ్ర‌కు త‌ర‌లించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కంక‌ణం క‌ట్టుకుని అందుకోసం అనుక్ష‌ణం త‌పించారు. ముందుగా తాను విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చి మంత్రుల‌నూ త‌న‌తో పాటు విజ‌య‌వాడ వ‌చ్చేలా చేశారు. ఆ త‌రువాత ఉద్యోగులు స‌సేమిరా అంటున్నా వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌యం నిర్మించి ఒక్కో శాఖ‌ను ఆగ‌మేఘాల‌మీద అక్క‌డ‌కు త‌ర‌లించారు. తాత్కాలిక స‌చివాల‌యంలో పూర్తి స్థాయిలో వ‌స‌తులు ఇంకా అందుబాటులోకి రాక‌పోయినా చంద్ర‌బాబు మాత్రం ఉద్యోగుల‌ను ఒప్పించి అక్క‌డికి వెళ్లేలా చేస్తున్నారు. అయితే... అసెంబ్లీ విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు ఎందుకో తొంద‌ర‌ప‌డ‌డం లేదు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాలు న‌వ్యాంధ్ర‌లోనే అని ప్ర‌తిసారీ చెబుతున్నా అవి మాట‌లుగానే మిగిలిపోతూ ఎప్ప‌టిలానే హైద‌రాబాద్ లోనే స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. తాజాగా సెప్టెంబ‌రు 8 నుంచి జ‌ర‌గ‌బోయే స‌మావేశాలూ హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు.

నిజానికి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు గుంటూరులో నిర్వ‌హించాల‌ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కూడా ప‌లుమార్లు చంద్ర‌బాబుకు సూచించారు. అయితే... చంద్ర‌బాబు మాత్రం ఎందుకో ఆ ప్ర‌తిపాద‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా సెప్టెంబర్ 8 నుంచి నిర్వ‌హించే స‌మావేశాలు హైదరాబాద్‌ లో ప్రారంభమవుతాయని ఏపీ ఆర్థిక - శాసన సభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్ర‌క‌టించారు. వ‌ర్షాకాల స‌మావేశాలు అమరావతిలోనే నిర్వహించాలని భావించినా పూర్తి స్థాయి సౌకర్యాలు లేని కారణంగా ఈసారి హైదరాబాద్‌ లోనే నిర్వహిస్తామన్నారు. దీంతో మ‌రోసారి కోడెల ఆశ‌లపై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌యింది.

కాగా అసెంబ్లీ స‌మావేశాలు హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించ‌డం వెనుక చంద్ర‌బాబుకు స్ప‌ష్ట‌మైన కార‌ణాలున్నాయ‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్ పై ప‌దేళ్ల పాటు ఏపీకీ హ‌క్కు ఉన్నందున కొన్నాళ్ల పాటు హైద‌రాబాద్ లోనే అసెంబ్లీని కొన‌సాగించాల‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌చివాల‌యాన్ని త‌ర‌లించిన‌ప్పుడు ఉద్యోగుల‌కు నివాస వ‌స‌తి ఏర్పాటులోనే ఇబ్బందులు ఎదుర‌య్యాయి. వారికి ప్ర‌యాణ ఏర్పాట్లూ త‌ల‌కు మించిన భార‌మ‌వుతున్నాయి. అలాంటిది ఎమ్మెల్యేల‌ను అమ‌రావ‌తిలో బ‌స చేయించ‌డం మ‌రింత ఇబ్బందని.. టీడీపీ ఎమ్మెల్యేలు త‌న మాట విని స‌ర్దుకుపోయినా విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌తి విష‌యాన్ని భూత‌ద్దంలో చూపి రాద్ధాంతం చేస్తార‌న్న భ‌యంతోనే ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాలు హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ లో ఎమ్మెల్యేల‌కు క్వార్ట‌ర్లు ఉండ‌డం.. కొంద‌రికి సొంతిళ్లు ఉండ‌డంతో ఎలాంటి స‌మ‌స్య లేదు. అదే అమ‌రావ‌తిలో అయితే ఆ ఏర్పాట్ల‌న్నీ ప్ర‌భుత్వ‌మే చూసుకోవాలి. ఆ కార‌ణంగానే ఆయ‌న అమ‌రావ‌తిలో స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు మొగ్గు చూప‌డం లేద‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది.