Begin typing your search above and press return to search.

ఎంతైనా యనమల ది గ్రేట్!

By:  Tupaki Desk   |   11 April 2018 2:30 PM GMT
ఎంతైనా యనమల ది గ్రేట్!
X
నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న, దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబునాయుడు ను ప్రభావితం చేయగలిగేంతటి వ్యక్తి తెలుగు రాజకీయాల్లో ఎవరైనా ఉంటారా..? అసలు అది సాధ్యమేనా? తాను గీసిన గీతను చంద్రబాబు దాటకుండా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల ఘనులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సమాదానం... యనమల రామకృష్ణుడు. అవును- యనమల ఎలా చెబితే అలా చంద్రబాబు వింటాడనే విషయం చాలా కాలంగా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్న అంశమే అయినప్పటికీ.. తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్.. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు అధ్యక్షుడిగా నియమితుడు అయిన నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చకు వస్తోంది.

పుట్ట సుధాకర్ యాదవ్.. యనమలకు వియ్యంకుడు. తెలుగుదేశం పార్టీకి ఆపత్సమయాల్లో ఆదుకునే పలువురిలో ఒకడు! ‘ఆ’ అవసరాలు ఉన్నప్పుడు ఆయనకూడా ఓ చేయి వేస్తుంటారని పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంతోపాటు... యనమల సిఫారసు బలమైనది గనుక.. ఆయన మీద క్రిస్టియానిటీకి సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ.. చంద్రబాబు గతంలో టీటీడీ మెంబరును చేశారు.

ఆ తర్వాతి కాలంలో యాదవ వర్గం మీద చంద్రబాబుకు మనస్తాపం కూడా కలిగింది. తెలంగాణలో యాదవ అనుకూల నిర్ణయాలు తీసుకున్నందుకు కేసీఆర్ కు విజయవాడలోను, రాష్ట్రంలోని పలుచోట్ల యాదవులు పాలాభిషేకాలు నిర్వహించడం చంద్రబాబుకు మనస్తాపం కలిగించింది. ఈ సత్కారాలు వెనుక కేసీఆర్ నుంచి గరిష్టంగా లబ్ధి పొందుతున్న యనమల రామకృష్ణుడు కూడా ఉన్నాడని ఆయన బాధపడినట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి.

ఎంతగా యనమల పట్ల మనస్తాపం ఉన్నప్పటికీ.. ఆయన ఆబ్లిగేషన్ ను మాత్రం చంద్రబాబు కాదనలేకపోయారు. యనమల మాట మీరకుండా.. ఆయన వియ్యంకుడు పుట్టాసుధాకర్ యాదవ్ పట్ల ఉండే మతపరమైన అభ్యంతరాలన్నిటినీ తోసిరాజని.. టీటీడీ అధ్యక్షుడిగా ప్రకటించేశారు. సభ్యులపేర్లకు ‘టిక్’ పెట్టేంత ఖాళీ కూడా లేకపోయినప్పటికీ.. హడావుడిగా అధ్యక్షులను మాత్రం ప్రకటించేశారు... ఎంతైనా యనమల ది గ్రేట్ అని పార్టీలో అనుకుంటున్నారు.