నవ్యాంధ్ర దివాలా తీస్తోందా?

Sat Sep 23 2017 11:13:41 GMT+0530 (IST)

చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా అంచున ఉందన్న ఆందోళనలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు అధికార వర్గాల్లోనూ ఇలాంటి భయం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సాక్షాత్తు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఇటీవల రాష్ర్ట ఆర్థిక పరిస్థితి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఖజానా కుంగిపోతోందని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఆయన మాటలు నిజమేనని అర్థమవుతోంది.
    
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు పూర్తి కావస్తోంది. అయినా వార్షిక ఆదాయ లక్ష్యంలో ఇప్పటివరకు సగం కూడా రాలేదు. కేవలం 38 శాతం ఆదాయ లక్ష్యం మాత్రమే ఇప్పటి సాధించగలిగారు. మిగిలిన ఆరు నెలల్లో ఇంకా 62 శాతం మేరకు ఆదాయం రావడం దాదాపు అసాధ్యమే.  దీనికి తోడు కేంద్రం మొహం చాటేయడం రాష్ట్రంలో ఆర్థిక వనరులు తగ్గిపోతుండడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోరది.
    
రాష్ట్ర విజభన తరువాత కనీసం రెండుమూడేళ్లకైనా కోలుకుంటామని ప్రభుత్వం చెప్పిన మాటలు వాస్తవ రూపంలోకి రావడం లేదు. అంచనా మేరకు ఆదాయం రాకపోవడం ఖర్చు పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.56850 కోట్లు ఆదాయం రావాల్సి ఉందని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇది గత ఏడాది కన్నా ఏకంగా 22.82 శాతం అధికం. ఇంతగా ఆదాయ లక్ష్యాన్ని పెంచేయడం వల్ల లక్ష్య సాధన కష్టమవుతుందని అప్పట్లో అధికారులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్ష్యంలో ఇంతవరకు కేవలం రూ. 21764 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. దీంతో ఆర్థిక సంక్షోభ ప్రమాదముందన్న వాదనలు సీనియర్ అధికారుల నుంచి వినిపిస్తన్నాయి.